Online Gaming Websites:యువతను పెడదారి పట్టించి ప్రాణాలు తీయడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థనే నాశనం చేస్తున్న గేమింగ్ యాప్‌లపై  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్(DGGI) ఉక్కుపాదం మోపింది. రూల్స్ పాటించకుండా ఉన్న 300లకుపైగా వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసింది. అలాంటి యాప్‌లు కలిగి ఉండటం నేరమని కేంద్ర సంస్థ యువతను హెచ్చరించింది. వెంటనే వాటిని ఫోన్‌ల నుంచి తొలగించాలని సూచించింది. 

శనివారం కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి చట్టపరమైన అనుతులు లేకుండా చట్టవవిరుద్ధంగా నడుస్తున్న 357 ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థల వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసింది. ఇంకా 700లకుపైగా సంస్థలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు పేర్కొంది.  

ప్రతి రోజు ఆన్‌లైన్ గేమింగ్ మత్తులో పడి చాలా మంది యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. అప్పులు పాలవుతున్నారు. దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వీళ్ల పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేసేందుకు కూడా ఈ గేమింగ్ యాప్స్ ప్రయత్నిస్తున్నాయి. దేశీయ చట్టాలను పట్టించుకోకుండా పన్నులు ఎగవేస్తూ నడుస్తుందున్న హవాలా డబ్బు దేశంలోకి వచ్చేందుకు కూడా సహకరిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నింటితో వాటిపై ఉక్కుపాదం మోపేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్ (DGGI) చర్యలు చేపట్టింది. మొదట విడతగా ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ గేమింగ్ సంస్థలపై చర్యలు ప్రారంభించింది. ఇప్పుడు డీజీజీఐ చర్యలు తీసుకున్న ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థల్లో దేశీయ  విదేశీ ఆపరేటర్లు ఉన్నారు.

"ఈ సంస్థలు రిజిస్టర్ చేసుకోలేదు. పన్నులు ఎగవేసేందుకు ఆదాయ వివరాలు దాచడం. GSTని ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి 357 సంస్థలను గుర్తించి వేటు వేశారు. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) సమన్వయంతో, IT చట్టం, 2000లోని సెక్షన్ 69 కింద ఈ చర్యలు తీసుకున్నారు."అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

నిఘాలో దాదాపు 700 సంస్థలు GST చట్టం ప్రకారం, 'ఆన్‌లైన్ మనీ గేమింగ్' అనేది జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. అందుకే దీన్ని గూడ్స్‌గా డిసైడ్ చేసి 28 శాతం పన్ను కూడా వేశారు. ఈ రంగంలో సేవలు అందించే సంస్థలు GST కింద నమోదు చేసుకోవాలి. ఇటీవల కొన్ని అక్రమ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఆ పని చేయడం లేదు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. 

ఇలాంటి అక్రమాలు గుర్తించిన DGGI ఆపరేషన్ చేపట్టింది. I4C, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమన్వయంతో ఈ సంస్థల్లో రిజిస్టర్ అయి గేమ్స్ ఆడిన వారి వివరాలు సేకరించింది. వారు చేసిన చెల్లింపులను గుర్తించింది. ఆయా బ్యాంక్ ఖాతాలు పరిశీలించి వాటి ఆధారంగానే చర్యలు తీసుకుంది. దాదాపు 2,000 బ్యాంక్ ఖాతాలు, రూ. 4 కోట్లను అటాచ్ చేసింది. UPI IDలతో అనుసంధానించిన 392 బ్యాంక్ ఖాతాలను డెబిట్ ఫ్రీజ్‌లో ఉంచారు. మొత్తంగా రూ. 122.05 కోట్లు అటాచ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇవే కాకుండా విదేశాల్లో ఉంటూ ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు నడుపుతున్న వారిపై కూడా DGGI ఆపరేషన్ చేపట్టింది. అక్కడ కూడా అక్రమాలు జరుగుతున్నాయని గ్రహించి 166 మ్యూల్ అకౌంట్స్‌ను బ్లాక్ చేసింది. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది. ఇంకా మరికొందరిపై దర్యాప్తు సాగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్‌లతో పాటు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు వాటిని ప్రమోట్ చేస్తున్నట్టు గుర్తించింది. ఇప్పటికే ఇలాంటి వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించి నలభై మంది వరకు కేసులు పెట్టింది. మరికొందరిపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అరెస్టులు కూడా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఆన్‌లైన్ మనీ గేమింగ్స్‌ ఆడదొద్దని సూచిస్తోంది.