Central Government Launches CAA New Portal: కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act) అమలుకు సోమవారం సాయంత్రం కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు దేశ పౌరసత్వం కల్పించే లక్ష్యంతో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సీఏఏ కింద దరఖాస్తుల స్వీకరణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త వెబ్ పోర్టల్ (CAA Web Portal) ప్రారంభించింది. https://indiancitizenshiponline.nic.in తో పాటు CAA - 2019 పేరుతో మొబైల్ యాప్ ను సైతం అందుబాటులోకి తీసుకు రానున్నట్లు వెల్లడించింది. కాగా, 2014 డిసెంబర్ 31వ తేదీ కన్నా ముందు హింసకు గురై భారత్‌కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించనున్నారు. వారి వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి మన పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చింది. భారత్‌లో 11 ఏళ్ల పాటు ఉన్న శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పించేలా పాత చట్టంలో ఉన్న నిబంధనను పూర్తిగా సవరించింది మోదీ సర్కార్. గత 14 ఏళ్లలో కనీసం ఐదేళ్ల పాటు లేదంటే ఏడాది కాలంగా భారత్‌లోనే నివసించిన వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
దరఖాస్తు ఇలా
☛ పౌరసత్వం కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు https://indiancitizenshiponline.nic.in పోర్టల్ కు వెళ్లి.. 'సీఏఏ, 2019 కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తుల సమర్పణ' అనే బటన్ పై క్లిక్ చేయాలి.
☛ అనంతరం మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, ఈ మెయిల్ ఐడీ ఇతర వివరాలు నమోదు చేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.
☛ అనంతరం వివరాలన్నీ సరి చూసుకుని సబ్మిట్ క్లిక్ చేస్తే.. ఈ మెయిల్, మొబైల్ కు ఓ ఓటీపీ వస్తుంది. దీని వెరిఫై చేసిన తర్వాత అదనపు వెరిఫికేషన్ కోసం మళ్లీ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
☛ తర్వాత, మీ పేరుతో లాగిన్ అయ్యి 'న్యూ అప్లికేషన్' బటన్ పై క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన మీకు సంబంధించిన వివరాలన్నీ ఎంటర్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
☛ అప్లై చేసే క్రమంలో దరఖాస్తుదారులు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అప్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు జారీ చేసిన పాస్ పోర్ట్, బర్త్ సర్టిఫికెట్ లేదా ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
☛ వీటితో పాటే 2014, డిసెంబర్ 31వ తేదీకి ముందే భారత్ లోకి ప్రవేశించారని రుజువు చూపే డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
☛ దేశానికి వచ్చిన సమయంలో వీసా కాపీ, ఇమ్మిగ్రేషన్ స్టాంప్, భారత్ లో జారీ చేసిన రేషన్ కార్డు, ఒకవేళ ఇక్కడే జన్మిస్తే బర్త్ సర్టిఫికెట్, రిజిస్టర్డ్ రెంటల్ అగ్రిమెంట్, పాన్ కార్డు, విద్యుత్ బిల్లులు, బీమా పాలసీలు, మ్యారేజ్ సర్టిఫికెట్ ఇలా ఏదైనా గుర్తింపు కార్డును సమర్పించాల్సి ఉంటుంది.
అయితే.. సీఏఏ చట్టం నుంచి గిరిజన ప్రాంతాలను మాత్రం మినహాయించింది. అసోం, మేఘాలయా, మిజోరం, త్రిపురను మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో ఉండడం వల్ల అసోంలోని కర్బీ అంగ్‌లాంగ్, మేఘాలయలోని గారో హిల్స్, మిజోరంలోని చమ్‌కా, త్రిపురలోని పలు గిరిజన ప్రాంతాలను ఇందులో నుంచి మినహాయించింది.
Also Read: Nayab Singh Saini: హరియాణాలో కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వం - నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ