Delhi Services Bill: ఢిల్లీ సర్వీసెస్ బిల్లును లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందుకు సంబంధించి గతంలో కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ ను చట్టం చేయడం కోసం లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర సర్కారు. ఈ ఢిల్లీ సర్వీసెస్ బిల్లును అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిట్ల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు -2023 గా పరిగణిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా తరఫున కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లును ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు ఢిల్లీ ప్రభుత్వ హక్కులను కాలరాసే ప్రయత్నమని అన్నారు. ఈ బిల్లు సుప్రీం కోర్టు గత తీర్పులకు విరుద్ధమని అన్నారు.


మార్పులు చేసిన బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం


జులై 31వ తేదీన ఈ బిల్ ప్రవేశ పెట్టాల్సి ఉన్నా.. అది వాయిదా పడింది. ఇందుకు ప్రధాన కారణం.. ఆ బిల్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం. ఇప్పటికే ఇది వివాదాస్పదం అవడం వల్ల కేంద్రం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ మార్పులు చేసిన తరవాతే పార్లమెంట్‌లో బిల్‌ని ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తరఫున నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్‌లో మూడు కీలకమైన అంశాలను తొలగించి ఓ రూల్‌ని జోడించనున్నట్టు తెలుస్తోంది. ఇకపై దీన్ని Government of National Capital Territory of Delhi (Amendment) Billగా పిలవనున్నారు. ఈ ఏడాది మే నెలలోనే ఈ ఆర్డినెన్స్‌ని తయారు చేసినప్పటికీ సుప్రీంకోర్టు మందలించడం వల్ల వాయిదా పడింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాలు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అధికారుల బదిలీ, నియామకాలపై పూర్తి అధికారులు ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటాయని తేల్చి చెప్పింది. అయినా కేంద్రం ఈ విషయంలో పట్టు విడవడం లేదు. 


ఏం మారింది..?


స్టేట్ పబ్లిక్ సర్వీస్‌లతో పాటు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లలో ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో బిల్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే..ఇప్పుడీ బిల్‌ని పక్కన పెట్టి సంస్కరిస్తున్నారు. ఇందులోని కొత్త ప్రొవిజన్ ప్రకారం...ఢిల్లీ ముఖ్యమంత్రి నేతృత్వంలో నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ (National Capital Civil Service Authority) ఏర్పాటవుతుంది. ఈ అథారిటీ సూచనల ఆధారంగానే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సర్వీస్ కమిషన్‌లలో నియామకాలకు అనుమతినిస్తారు. ముఖ్యమంత్రి అన్న మాటే కానీ తనకు ఎలాంటి అధికారాలు లేకుండా పోయాయని, అంతా లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉంటోందని కేజ్రీవాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఆయన కేంద్రంపై న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆప్, బీజేపీ మధ్య వైరాన్ని మరింత పెంచింది ఈ బిల్. ఢిల్లీలోని అధికారులందరినీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది ఆప్. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిశారు. తమకు మద్దతునివ్వాలని కోరారు. ఈ విషయంలో తీర్పుని రివ్యూ చేయాలని కేంద్రం సుప్రీంకోర్టుని కోరింది.