CBI Has Issued Summons To Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అక్రమ మైనింగ్‌ కేసులో సీబీఐ అఖిలేశ్‌కు సమన్లు జారీ చేసి విచారణకు పిలిచింది. ఈ కేసులో సాక్షిగా సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అఖిలేశ్‌కు సమన్లు జారీ చేసినట్టు చెబుతున్నారు. గురువారం ఆయన్ను దర్యాప్తు సంస్థలు విచారించే అవకాశముంది.


అక్రమ మైనింగ్‌కు సంబంధించి రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. 2012 నుంచి 2016 మధ్య కాలంలో నిబంధనలను ఉల్లంఘించి అధికారులు గనులను కేటాయించారన్న ఆరోపణలు నేపథ్యంలో సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. అడ్డగోలుగా గనులు కేటాయించారన్న ఆరోపణలు వస్తున్న మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా అఖిలేశ్‌ యాదవ్‌ వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి 2013 వరకు మైనింగ్‌ శాఖను ఆయనే పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే అఖిలేశ్‌ యాదవ్‌ను సమన్లు జారీ చేసి విచారణకు పిలుస్తున్నట్టు చెబుతున్నారు.


రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశం


సమన్లు జారీ చేసిన సీబీఐ ఈ నెల 29న విచారణకు హాజరుకావాల్సిందిగా అఖిలేశ్‌ యాదవ్‌ను ఆదేశించింది. ఈ టెండరింగ్‌ ప్రక్రియను ఉల్లంఘించి అక్రమంగా ఇసుక మైనింగ్‌కు ఫ్రెష్‌ లీజ్‌లు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిగా అధికారులు, మరికొంత మంది నేతలు లబ్ధి పొందారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో 2019 జనవరి ఐదో తేదీన యూపీలోని హమీర్‌పూర్‌; జలాన్‌, నొయిడా, కాన్ఫూర్‌, లక్నోతోపాటు ఢిల్లీ వంటి 12 ప్రాంఆల్లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా అఖిలేశ్‌ యాదవ్‌కు సీబీఐ సమన్లు జారీ చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ కలిసి పోటీ చేయనున్నాయి. కొద్దిరోజులు కిందట సీట్ల పంపకాలు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో మైనింగ్‌ వ్యవహారంలో సీబీఐ నుంచి అఖిలేశ్‌కు సమన్లు రావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.