Caste Census : కుల గణన, జనాభా లెక్కలపై కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ప్రస్తుతం ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కులగణన ప్రక్రియను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించబోతోంది. 1 అక్టోబర్ 2026 నుంచి తొలి దశ కులగణన స్టార్ట్ చేయనున్నట్టు పేర్కొంది. దీన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని చూస్తోంది. రెండో దశను మార్చి 1, 2027 నుంచి స్టార్ట్ చేయనున్నారు. అదే సమయంలో, లడఖ్, జమ్మూ-కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత రాష్ట్రాల్లో అక్టోబర్ 1, 2026 నుంచి జనాభా లెక్కలు ప్రారంభమవుతాయి. కుల గణనతోపాటు, జనాభా లెక్కలు 2 దశల్లో ప్రారంభిస్తారు.
సాధారణంగా జనాభా లెక్క సమయంలో దేశవ్యాప్తంగా అడిగే ప్రశ్నల జాబితాకు ఈసారి కొత్తగా కులానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్నను జోడిస్తుంది. ఇటీవల, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, తదుపరి జనాభా లెక్కల్లో కుల గణనను చేర్చడానికి రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని ప్రకటించారు.
జాతీయ జనాభా రిజిస్టర్ (NPR)ను నవీకరించడానికి సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలు చెపడుతుంటారు. 2021 లో నిర్వహించాల్సి ఉంది, కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. 2011 లో జరిగిన చివరి జనాభా లెక్కింపులో భారతదేశ జనాభా 121 కోట్లకుపైగా నమోదైంది.
హోం మంత్రిత్వ శాఖ ఏమి చెప్పిందో తెలుసా?
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఇలా చెప్పింది, "కులాల గణనతోపాటు జనాభా గణన-2027 ను రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. జనాభా గణన-2027 తేదీ మార్చి, 2027 1న ఉంటుంది."
"లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం, జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంతోపాటు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల‌్లోని నాన్-సింక్రోనస్ మంచు ప్రాంతాలకు 1 అక్టోబర్, 2026న ప్రారంభం అవుతుంది. 1948 జనాభా లెక్కల చట్టంలోని సెక్షన్ 3లోని నిబంధన ప్రకారం, తేదీలతో జనాభా గణన నిర్వహించాలనే ఉద్దేశ్యానికి సంబంధించిన నోటిఫికేషన్ 16.06.2025న అధికారిక గెజిట్‌లో ప్రచురితం అవుతుంది " అని ప్రకటన పేర్కొంది.
జనాభా లెక్కల ప్రక్రియలో, సంబంధిత అధికారులు దేశ ప్రజలకు సంబంధించిన డేటాను సేకరిస్తారు. ఇందులో సామాజిక, జనాభా, సాంస్కృతిక, ఆర్థిక డేటా ఉంటుంది. ఈ డేటా విధాన రూపకల్పన, అభివృద్ధి ప్రాజెక్టులను అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
భారత్‌లో ఎప్పుడు జనాభా లెక్కలు నిర్వహించారు
భారత దేశంలో జనాభా లెక్కలు 1872లో మొదటిసారి బ్రిటీష్ వారి కాలంలో జరిగాయి. లార్డ్ మయో ఆధ్వర్యంలో ఈ లెక్కింపు జరిగింది. అది వివిధ ప్రాంతాల్లో వివిధ కాలాల్లో లెక్కింపు జరిగింది. కానీ 1881 మాత్రం దేశవ్యాప్తంగా ఒకేసారి ఒకే సమయంలో ఒకే విధానంలో జనాభా లెక్కలు నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకోసారి జనాభా లెక్కలు చేపడుతున్నారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే విధానాన్ని కొనసాకించారు. 1948లో ప్రత్యేకంగా జనాభా లెక్కల చట్టాన్ని అమలు చేసి స్వాంతత్య్ర భారత దేశంలో 1951లో జనాభా లెక్కలు చేపట్టారు. ఇలా ఇప్పటి వరకు 15సార్లు జనాభాలున లెక్కిస్తూ వచ్చారు. వచ్చే ఏడాది నుంచిజరిగేది 16వ జనాభా లెక్కలు అవుతాయి.
2011లో జరిగిన జనాభా లెక్కల వివరాలు ఏంటీ?
2011లో చేపట్టిన జనాభా లెక్కలకు సుమారు 2200 కోట్లు రూపాయలు ఖర్చు అయ్యింది.
2011 లెక్కల ప్రకారం జనాభా లెక్కలు ఇలా ఉన్నాయి.
- మొత్తం జనాభా- 1,21,08,54,977
- పురుషులు- 62,37,24,598
- మహిళలు- 58,64,69,294
- గ్రామీణ జనాభా- 83.36 కోట్లు
- పట్టణ జనాభా- 37.71 కోట్లు
- అక్షరాస్యత రేటు- 74.04 శాతం
- పురుషుల్లో అక్షరాస్యత రేటు- 82.1శాతం
- స్త్రీలలో అక్షరాస్యత రేటు- 65.46 శాతం
- స్త్రీ పురుష నిష్పత్తి- వెయ్యిమంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు.
- పిల్లల్లో స్త్రీ పురుషుల నిష్పత్తి(ఆరేళ్ల లోపు)- 919
- జనాభా పెరుగుదల రేటు 177 శాతం(2001-2011)