Madhya Pradesh New Chief Minister: మధ్యప్రదేశ్‌లో కొత్త సీఎం పేరును ఎట్టకేలకు బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ నియమితులు అయ్యారు. రాష్ట్రంలో నేడు (డిసెంబరు 11) జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ నాయకుడిని ఎన్నుకున్నారు. దీంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిపై ఇన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇటీవల రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. అభ్యర్థి లేకుండా బరిలో నిలిచి విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఊహాగానాలు సాగాయి.


అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 163 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. అయితే, మధ్య ప్రదేశ్ సీఎం రేసులో చాలా మంది పేర్లు వినబడ్డాయి. ఇందులో ప్రహ్లాద్ పటేల్, నరేంద్ర సింగ్ తోమర్, వీడీ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా, కైలాష్ విజయవర్గీయ వంటి వారి పేర్లు ఉన్నాయి. ఇందులో కేంద్ర మంత్రులుగా ఉన్న వారు తమ పదవులకు రాజీనామా చేశారు. బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచి మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసింది.


మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మోహన్ యాదవ్ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. వరుసగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించి ఉజ్జయిని సౌత్ సీటును కైవసం చేసుకున్నారు. ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచారు. 2013లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ లో మోహన్ యాదవ్ మంత్రిగా పని చేశారు.
9 రోజుల మేధోమథనం తర్వాత బీజేపీ మోహన్ యాదవ్ పేరును ముఖ్యమంత్రిగా ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. బీజేపీ భోపాల్ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కొత్త సీఎం పేరును ఆమోదించారు.






మోహన్ యాదవ్ హిందూత్వ ఇమేజ్ ఉన్న నాయకుడు. ఈయన రాష్ట్రంలోనే అత్యంత విద్యావంతులైన నాయకులలో ఒకరు. అతను B.Sc., LLB, MA పొలిటికల్ సైన్స్ డిగ్రీలను కలిగి ఉన్నారు. దీనితో పాటు, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో MBA, PhD డిగ్రీ పట్టాలు కూడా ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో వ్యవసాయం, వ్యాపారమే తన జీవనాధారమని పేర్కొన్నారు. ఆయనకు భార్య సీమా యాదవ్, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మోహన్ యాదవ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో సుదీర్ఘ అనుబంధం ఉంది. 1982లో ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన ఏబీవీపీలో చేరి.. మాధవ్ విజ్ఞాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ కో-సెక్రటరీగా ఎన్నికయ్యారు. దీని తరువాత, ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరి 2004లో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు.


ఈసారి 12 వేల ఓట్ల తేడాతో విజయం


ఈసారి మోహన్ యాదవ్ తన సాంప్రదాయ ఉజ్జయిని సౌత్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటి రెండు రౌండ్ల వరకు ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చేతన్ యాదవ్ కంటే వెనుకబడి ఉన్నారు. అయితే, దీని తర్వాత ఆయన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో మోహన్ యాదవ్ 12,941 ఓట్ల మెజారితో ప్రత్యర్థిపై విజయం సాధించారు.