Bengaluru Horror Man Dies in Car | బెంగళూరు: ఈ మధ్య కాలంలో లవ్ అఫైర్స్ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తనను ప్రేమించాలని, లేక పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడం.. ఆపై హత్య చేయడమో, లేక ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి ఘటనే కర్ణాటకలో శనివారం ఒకటి జరిగింది. కారులో వెళ్తూ పెట్రోల్‌ బాంబుతో లవర్‌ను బెదిరించాలని చూసిన యువకుడు, చివరికి కారులోనే సజీవదహనం కావడం కలకలం రేపుతోంది. 

Continues below advertisement

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూరు జయనగరకు చెందిన ఓ యువతి స్థానిక సంజయ్‌ గాంధీ ఆసుపత్రిలో ఓటీ (OT) టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఆమెకు, నాగేంద్ర అనే 30 ఏళ్ల యువకుడితో ఆరేళ్లుగా పరిచయం ఉంది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, కొన్ని రోజుల నుంచి ఆమె నాగేంద్రకు దూరంగా ఉంటోంది. అతని ప్రవర్తన నచ్చక నాగేంద్ర సెల్‌ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేసి, మాట్లాడటానికి కూడా ఆసక్తి చూపడం లేదు. అయితే ప్రియురాలు తనను దూరం పెట్టడాన్ని నాగేంద్ర భరించలేకపోయాడు. అసలు సంగతేంటో తేల్చాలని భావించాడు.

తన ప్లాన్ ప్రకారం నాగేంద్ర శనివారం (జూన్ 27న) ఒక కారును అద్దెకు తీసుకొని ప్రియురాలు రూముకు వెళ్లాడు. తనతో కొన్ని విషయాలు మాట్లాడాలంటూ అంకోలాకు రావాలంటూ గొడవ చేశాడు. దాంతో ఉదయం ఏడు గంటలకే వీరిద్దరూ బెంగళూరు నుంచి కారులో బయలుదేరారు. కారు తుమకూరు దాటిన తర్వాత, తనను ఎందుకు దూరం పెడుతున్నావని, తనను వివాహం చేసుకోవాలని నాగేంద్ర యువతిని కోరాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని పెట్రోల్‌ బాంబు తీసి ఆమెను బెదిరించాడు. అయినా ఆమె పెళ్లికి అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో నాగేంద్ర మొదట ప్రియురాలి తల, చేతులపై కత్తితో దాడి చేశాడు.

Continues below advertisement

ఈ క్రమంలో డ్రైవర్ కారును జోగిహళ్లి ప్రాంతానికి తీసుకెళ్లాడు. పరిస్థితి గమనించిన డ్రైవర్ కారు కొంచెం స్లో చేయగా.. ఇది గమనించిన యువతి, వెంటనే కారు డోర్ ఓపెన్ చేసి బయటకు దూకేసింది. పెట్రోల్ బాంబుతో పేల్చివేస్తాడేమోనని భయపడి డ్రైవర్ సైతం వెంటనే కిందకు దూకేశాడని పోలీసులు తెలిపారు. వెంటనే సెకన్ల వ్యవధిలోనే కారులో పెట్రోల్‌ బాంబు పేలింది. నిమిషాల వ్యవధిలో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్దమైంది. మంటలు త్వరగా చెలరేగడం పెట్రోల్ బాంబు పేలడంతో షాకైన నాగేంద్ర కారు నుంచి బయటకు రాలేకపోయాడు. దాంతో కారులోనే క్షణాల్లో సజీవదహనమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కళ్లంబెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రియురాలని చంపేందుకు నాగేంద్ర యత్నించగా పెట్రోల్ బాంబు పేలిందా.. లేక ప్రమాదవశాత్తు పేలిందా, ఆత్మహత్య చేసుకోవాలని పేల్చాడా అని అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.