వాషింగ్ పౌడర్ నిర్మా పేరుతో తెలంగాణ బీఆర్‌ఎస్‌ చేసిన ప్రచారానికి మరింత అడ్వాన్స్డ్‌గా బెంగాల్‌లో టీఎంసీ సరికొత్త ప్రచారానికి తెర తీశారు. బీజేపీయేతర పార్టీల్లో ఉన్న నాయకులపై కేసులు నమోదు చేస్తున్న కేంద్రం వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని కేసుల్లో ఇరుకున్న వాళ్లు బీజేపీలో చేరిన తర్వాత పునీతులవుతున్నారని ఆరోపిస్తున్నాయి. 


బీజేపీలో ఉంటే నీతిపరులు ఇతర పార్టీల్లో ఉన్న వాళ్లంతా అవినీతిపరులు అన్నట్టుగానే కేంద్రం కేసులు పెడుతోందని విపక్షం ఆరోపిస్తోంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివిధ మార్గాలను పార్టీలు అనుసరిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ వాషింగ్ పౌడర్‌ పేరుతో వీడియోలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఆప్‌ కూడా పోస్టర్ వార్‌కు సిద్ధ పడింది. అన్నింటికి భిన్నంగా ప్రచారానికి సిద్ధపడ్డారు టీఎంసీ అధినేత మమత బెనర్జీ. 


బీజేపీ పేరుతో ఓ వాషింగ్‌ మెషిన్‌ను ఓ సభలో ప్రదర్శించారు మమతా బెనర్జీ. కోల్‌కతాలో బీజేపీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ వాషింగ్ మెషీన్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ డిఫరెంట్ స్టైల్లో కనిపించారు. 






పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం (మార్చి 29) బీజేపీపై విరుచుకుపడ్డారు. వాషింగ్ మెషీన్‌లతో ప్రదర్శనలు ఇచ్చారు. కోల్ కతాలో తృణమూల్ కాంగ్రెస్ సింబాలిక్ వాషింగ్ మెషీన్ ను ఏర్పాటు చేశారు. దీనిని బీజేపీ వాషింగ్ మెషీన్ గా అభివర్ణించారు.


బీజేపీ వాషింగ్ మెషిన్ పేరుతో ఉన్న సింబాలిక్‌ మెషిన్‌లో మొదట నలుపు దుస్తులు వేశారు. తర్వాత అవి తెలుపుగా మారిపోయాయంటూ ప్రజలకు చూపించారరు. బిజెపి పాలనలో కేంద్ర సంస్థలను  ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పుతున్నారని విరుచుకుపడ్డారు. ఒక ప్రతిపక్ష నాయకుడు బిజెపిలో చేరిన వెంటనే అతను నిర్దోషి అవుతాడని అదే 'బీజేపీ వాషింగ్ మెషీన్ మాయాజాలం' అని విమర్శలు చేశారు. 






బీజేపీని టార్గెట్ చేసిన సీఎం మమత 


బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెండు రోజుల దీక్ష నిర్వహించారు. నిరసనను ప్రారంభించిన మమతా బెనర్జీ .. 'బీజేపీ వాషింగ్ మెషీన్‌లా మారింది. దొంగలు, దోపిడీదారుల జాబితా తీసుకోండి, వారంతా అక్కడ (బిజెపిలో) కూర్చున్నారు. రాజ్యాంగం గురించి ఆయన ప్రసంగాలు వినాలి' అని ఆమె అన్నారు. అవసరమైతే ప్రధాని నివాసం వద్ద కూడా కూర్చుంటానని చెప్పారు.