Constitution Gallery: కొత్త పార్లమెంటు భవనంలో దేశ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా రాజ్యాంగ గ్యాలరీని ఏర్పాటు చేశారు. దేశ చరిత్ర, సంస్కృతికి పెద్దపీట వేశారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల వేళ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కొత్త పార్లమెంటు భవనంలోని రాజ్యాంగ గ్యాలరీ ఏర్పాటు చేశారు. కూచిపూడి నాట్యం, బతుకమ్మ, పండిట్ రవిశంకర్ సితార్, కోణార్క్ సూర్య దేవాలయం, భిన్న సంస్కృతులను ప్రతిబింబించే చిత్రాలు, ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ వాయిద్య పరికరాలు, మన ఇతిహాసపు కాలం నాటి నమ్మకాలను గుర్తు చేసే సంఘటనలను పొందుపరిచారు. పార్లమెంటులోకి ప్రవేశించే 6 ద్వారాలకు గజ, హంస, మకర, అశ్వ, శార్దూల, గరుడ ద్వారాలుగా పేర్లు పెట్టారు. గజ ద్వారానికి ప్రతీకగా దాని ఎదుట కర్ణాటక బనబాసి మధుకేశ్వర ఆలయంలోని ఏనుగు ప్రతిమను పోలిన దాన్ని ఏర్పాటు చేశారు. హంస ద్వారానికి కర్ణాటక హంపిలోని విజయ విఠల ఆలయ హంసను ఉంచారు. మకర ద్వారానికి కర్ణాటక హలేబేడులోని మొసలిని ఏర్పాటు చేశారు. 


అశ్వ ద్వారానికి ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయ గుర్రం, శార్దూల ద్వారానికి మధ్యప్రదేశ్ లోనని మొరేనా శివాలయంలోని పులిని ఉంచారు. గరుడ ద్వారానికి తమిళనాడు కుంభకోణంలోని ప్రాచీన గరుత్మంతుని విగ్ర ప్రతిబింబాన్ని ఏర్పాటు చేశారు. 


పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ గ్యాలరీకి శిల్ప దీర్ఘ, స్థపత్య దీర్ఘ, సంగీత్ దీర్ఘ పేరుతో మూడు విభాగాలను ఏర్పాటు చేశారు. శిల్ప దీర్ఘ విభాగంలో వివిధ రాష్ట్రాల్లోని పండుగలు, వృత్తులు, కళలను ప్రతిబింబిస్తూ వస్త్రాలపై కళాకారులు తీర్చిదిద్దిన కళాఖండాలను ఏర్పాటు చేశారు. స్థపత్య దీర్ఘ విభాగంలో వివిధ రాష్ట్రాల శిల్పకళా పరంగా గుర్తింపు పొందిన ఆలయాలు, కట్టడాల చిత్రాలను పొందుపరిచారు. స్థపత్య దీర్ఘ విభాగంలో ఏపీ నుంచి అనంతపురంలోని లేపాక్షి వీరభద్ర ఆలయం, నంది విగ్రహం, తెలంగాణ నుంచి రామప్ప ఆలయ చిత్రాలు ఉంచారు. సంగీత్ దీర్ఘ విభాగంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రి వంటి సంగీత కోవిదుల చిత్రాలతో పాటు ఆధునిక కాల సంగీతరంగ ప్రముఖులు పండిట్ రవిశంకర్, పండిట్ శివ్ కుమార్ శర్మ, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ వంటి ప్రముఖులు వినియోగించిన సితార్, సంతూర్, షెహనాయీలను ఏర్పాటు చేశారు. 


జన్, జనని, జన్మభూమి పేరుతో ఏర్పాటు చేసిన విభాగంలో దేశంలోని సంప్రదాయ కళాకారులు వేసిన చిత్రాలను ప్రదర్శించారు. దీనిని 6 భాగాలుగా రూపొందింపజేసి అన్నింటిని ఏక కళాఖండంగా మార్చి గోడకు అమర్చారు. ఈ కళాకారుల్లో తెలంగాణ చేర్యాలకు చెందిన స్క్రోల్ కళాకారులు పసుల మంగ, పసుల మల్లేశం, ఏపీకి చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు శిందే చిదంబరరావు, కళాంకారీ చిత్రకారిణి తలిశెట్టి రమణి ఉన్నారు.


వేదకాలం నుంచి ఇప్పటి వరకు ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతూ వచ్చిన తీరును కళ్లకు కట్టేలా మినియేచర్లతో ప్రదర్శన రూపొందించారు. దేశ ఎన్నికల చరిత్రను వివరించే స్లైడ్ లు ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ సభ్యులు ఆయా విశేషాలను వివరిస్తున్నారు. ప్రతి చోట సంబంధిత చిత్రాలు, కళాఖండాల ప్రాధాన్యాన్ని హిందీ, ఇంగ్లీషులో చదువుకునేలా టచ్ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు. హిందీలో, ఇంగ్లీష్ లో విని తెలుసుకునే ఏర్పాట్లు కూడా చేశారు. రాజ్యాంగ గ్యాలరీకి సంబంధించి sansadkikala.ignca.gov.in లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.