సస్పెన్స్‌కు తెరపడింది. రెండు రోజులుగా సాగిన ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు పడింది.  కర్ణాటక తదుపరి సీఎంగా బసవరాజ్ ప్రమాణస్వీకారం బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన బీజేపీ హైకమాండ్  ఇదే విషయంపై చర్చించారు. ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉన్న బసవరాజన్‌నే బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.  ఈ కారణంగా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు కావాల్సిన పక్రియ దాదాపుగా పూర్తయ్యింది.


ఎవరీ బసవరాజ్ బొమ్మాయ్...
బసవరాజ్ బొమ్మాయ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మాయ్ కుమారుడు. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బొమ్మాయ్ 2008లో బీజేపీలో చేరారు. 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత షిగ్గావ్ నియోజగవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం గెలిచారు. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఎస్ఆర్ బొమ్మాయ్ అత్యంత సన్నిహితుడు. యడియూరప్ప సైతం తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మాయన్‌ ఎంపిక చేయాలని అధిష్టానానికి సూచించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బసవరాజ్ బొమ్మాయ్ లింగాయత్ సామాజికవర్గానికి చెందడం ఆయనకు కలిసొచ్చిన మరో అంశం.


కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేసిన వెంటనే కొత్త ముఖ్యమంత్రి ఎవరవుతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. తొమ్మిది మంది రేసులో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అసలు ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే.. దానిపై పెద్ద చర్చే నడిచింది. చివరకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రదాన్ వెళ్లి కొత్త ముఖ్యమంత్రిపై నిర్ణయం తీసుకున్నారు. అందరి అంచనాలు తారుమారు చేస్తూ... బసవరాజు బొమ్మాయ్‌ను సీఎంగా ప్రకటించారు. 



ధర్వాడ్ పశ్చిమ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్, విజయపుర ఎమ్మెల్యే బసన్నగౌడ పాటిల్ యత్నల్, కర్ణాటక మంత్రులు మురుగేశ్ నిరానీ, బసవరాజు బొమ్మాయ్, ప్రహ్లాద్ జోషి, బీఎల్ సంతోష్, సీఎన్ అశ్వనాథ్ నారాయణ్, లక్ష్మణ్ సవడి, గోవింద్ కర్జోల్, విశ్వేశ్వర హెగ్డే కగేరి, సీటీ రవి పేర్లను బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు గుసగుసలు వినిపించాయి. కర్ణాటకలో బలమైన సామాజికవర్గమైన లింగాయత్‌ వర్గానికి ముఖ్యమంత్రి ఇస్తేనే మంచిదని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.


మరోవైపు యడియూరప్ప విషయంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోనే ఉంది. ఆయన రాజకీయ జీవితం ఏంటన్నది ఇంకా తేలలేదు. ఆయన్ని గరవర్నర్‌గా పంపిస్తారనే టాక్ వినిపిస్తున్నా... ఆ పదవి తీసుకునేందుకు యడియూరప్ప సిద్ధంగా లేరని తెలుస్తోంది. వేరే పార్టీ కూడా పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో అన్న ఉత్కంఠ యడియూరప్ప అభిమానుల్లో నెలకొంది. 


ALSO READ: "దిశ" బిల్లుపై ఏపీదే ఆలస్యమన్న కేంద్రం..! 


అమెరికాలో ఇసుక తుపాను బీభత్సం.. 8 మంది మృతి