Assam CM Himanta Biswa Sarma: ఈశాన్య రాష్ట్రమైన అస్సాం ప్రభుత్వం డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఫ్ తినడాన్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి హిమంత భిశ్వశర్మ నాయకత్వంలో జరిగిన కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటిదాక కొన్ని ప్రదేశాల్లోనే..
నిజానిక గో సంరక్షణ చట్టం-2021 ప్రకారం ఆలయాలకు సమీపంలో మాత్రం బీఫ్ తినడాన్ని నిషేధించారు. రాష్ట్రంలోని ఏ ఆలయం నుంచైనా ఐదు కిలోమీటర్ల పరిధితో భీఫ్ అమ్మడం గానీ, కొనడం గానీ చట్ట వ్యతిరేకమని తేల్చారు. అలాగే హిందువులతోపాటు సిక్కులు, జైనులు తదితర మైనారిటీలు అధికంగా ఉండే ప్రాంతాలలో బీఫ్ అమ్మకాలను నిషేధించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బ్యాన్..
ఇక నుంచి రాష్ట్రంలో బీఫ్ వంటకాలు అమ్మడాన్ని నిషేధించినట్లు అస్సాం ప్రభుత్వం తెలిపింది. రెస్టారెంట్లు, బార్లు, కమ్యునిటీ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ అమ్మడం, వంటకాలు చేయడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. గోవధ చట్టానికి మరింత పదును పెడుతూ, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ తెలిపారు. హిందువులలో గోవను అత్యంత పవిత్రమైన జంతువుగా పరిగణిస్తారు. దాన్ని వధించడాన్ని చాలా మంది ఖండిస్తారు. ఈ నేపథ్యంలో బీఫ్ వంటకాల నిషేధ చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
చట్టాన్ని స్వాగతించడం లేదా పాక్ వెళ్లిపోండి..
గోవధ నిషేధ చట్టానికి చేసిన సవరణలను అస్సాం మంత్రి పీజుష్ హజారిక సమర్థించుకున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ చట్టాన్ని స్వాగతించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఆ చట్టానికి మద్దతు తెలపకుంటే, దేశం విడిచి పాకిస్థాన్ వెళ్లిపోవచ్చని పరుషంగా మాట్లాడారు.
ఉప ఎన్నికలో గెలుపుతో జోష్ ..
గతనెలలో అస్సాంలోని సమగురి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి దీప్లు రంజన్ సర్మా 24,501 ఓట్ల తేడాతో కాంగ్రెస్ కి చెందిన తంజిల్ హుస్సేన్ పై ఘనవిజయం సాధించారు. నిజానికి సమగురి అనేది కాంగ్రెస్ కి కంచుకోట లాంటింది తంజిల్ తండ్రి రకిబుల్ హుస్సేన్ ఆ స్థానం నుంచి ఐదుసార్లు గెలుపొందారు. అయితే అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రకిబుల్ ఎంపీగా గెలవడంతో ఈ సీట్ ఖాళీ అయింది. దీంతో తన కుమారుడు తంజిల్ ను ఈ స్థానంలో నిలబెట్టగా, దాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఈ ఓటమి తర్వాత రకిబుల్ బీఫ్ బ్యాన్ పై చర్చ లేవదీశారు.
రాష్ట్రంలోని ఉత్తర, అప్పర్ అస్సాం ప్రాంతాలను సందర్శించి, బీఫ్ పై బీజేపీ హిందువులను మోసం చేస్తోందని ఆరోపణలు చేశారు. చాలా చోట్ల బీఫ్ వండిపెతున్నారని, అయినా ప్రభుత్వం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిజానికి ఈ వాదనకు కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హిందుత్వ ధోరణితో ముందుకు వెళ్లడం సరికాదని కొంతమంది వ్యాఖ్యానించారు. అయతే రకిబుల్ మాటలను పరిగణనలోకి తీసుకున్న సీఎం బిశ్వశర్మ.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీఫ్ బ్యాన్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ఆరోపణలకు ఈ నిర్ణయం ద్వారా చెక్ పెట్టనట్లు విశ్లేషిస్తున్నారు.