Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi Chief Minister) అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన సర్కారుపై పెట్టిన విశ్వాస తీర్మానం (Trust Vote)పై శనివారం బలపరీక్ష జరగనుంది. ఆప్ ఎమ్మెల్యేల (AAP MLA's)ను బీజేపీ (BJP) కొనడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ శుక్రవారం కేజ్రీవాల్ తన ప్రభుత్వంపై శుక్రవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని చెప్పేందుకు ఆయన అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించారు. అందులో భాగంగా శనివారం అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ జరగనుంది. అలాగే శనివారం కోర్టుకు సైతం హాజరై.. మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన ఐదు సమన్లను ఎందుకు దాటవేశారో వివరించే అవకాశం ఉంది.
అసెంబ్లీలో శుక్రవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ కేజ్రీవాల్ మాట్లాడారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని చెప్పారు. అలాగే లిక్కర్ స్కాం కేసులో తనను అరెస్టు చేస్తారని ఇద్దరు బీజేపీ సభ్యులు చెప్పారని అన్నారు. 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారని అన్నారు. బీజేపీలో చేరేందుకు ఆప్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్ చేశారన్నారు.
అయితే బీజేపీ ఆఫర్‌ను తమ పార్టీ ఎమ్మెల్యేలు తిరస్కరించారని కేజ్రీవాల్ తెలిపారు. ఆప్ ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ చేపట్టిందని ఆయన ధ్వజమెత్తారు. తమ ఎమ్మెల్యేలు ఎవరూ ఫిరాయించలేదని, అందరూ తమతోనే ఉన్నారని చూపించడానికి అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కేజ్రీవాల్ ప్రభుత్వం విశ్వాస పరీక్షను కోరడం ఇది రెండోసారి. 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
కోర్టులో ఈడీ పిటిషన్
ఢిల్లీ సీఎం ఉద్దేశపూర్వకంగా సమన్లను తీసుకోవడం లేదని, విచారణకు హాజరవకుండా కుంటి సాకులు చెబుతూనే ఉన్నారని ఈడీ ఇటీవల రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉన్నత స్థాయిలో ప్రజా ప్రతినిధిగా ఉన్న ఆయన విచారణకు హాజరవకపోతే ప్రజలకు తప్పుడు ఉదాహరణగా నిలుస్తారని పేర్కొంది. కేజ్రీవాల్ ఇప్పటివరకు ఐదు సమన్లను దాటవేశారని, పదే పదే సమన్లను వ్యతిరేకిస్తున్నారని ఈడీ పేర్కొంది.
మొదటి నుంచి ఊహాగానాలే
కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మొదటి సమన్లు జారీ చేసినప్పటి నుంచి పలు ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు. వారి తరహాలోనే కేజ్రీవాల్ సైతం అరెస్ట్ అవుతారంటూ చర్చ సాగింది. ఈ క్రమంలోనే ఆయన ఐదు సార్లు నోటీసులను తిరస్కరించారు.
ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో మద్యం కంపెనీల ప్రమేయం ఉందని సీబీఐ వాదిస్తోంది. "సౌత్ గ్రూప్"గా పిలువబడే ఒక మద్యం లాబీ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపించింది. కేసుపై బీజేపీ సైతం తీవ్రంగానే స్పందించింది. లిక్కర్ కుంభకోణం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆప్ గుజరాత్‌లో తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిందని, అందులో 12.91 శాతం ఓట్లు పొంది జాతీయ పార్టీగా స్థిరపడిందని బీజేపీ ఆరోపించింది.
ఐ డోంట్ కేర్ అంటున్న అరవింద్ కేజ్రీవాల్
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు పంపడం ఇది ఆరోసారి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనేకమందిని ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌పై కూడా అనేక ఆరోపణలు రావడంతో.. ఆయనకు నవంబర్ 1వ తేదీన తొలిసారి ఈడీ నోటీసులు ఇచ్చింది.
డిసెంబర్ 21న మళ్లీ సమన్లు జారీ చేసింది. అయినా కేజ్రీవాల్ విచారణకు రాకపోవడంతో ఈ ఏడాది జనవరి 3, జనవరి 18న, ఫిబ్రవరి 2న నోటీసులు జారీ చేసింది. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదు. కాగా లిక్కర్ స్కాంలో తన పాత్ర లేదని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను ఇరికిస్తున్నారని కేజ్రీవాల్ కామెంట్ చేశారు. తాను తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే ఈడీ అరెస్ట్ చేసుకోవచ్చని, తాను భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానంటూ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.