Indian Army | న్యూఢిల్లీ: భారత త్రివిధ బలగాలలో సమష్టితత్వం, కమాండ్ సామర్థ్యాన్ని మరింత పెంచాలన్న ఉద్దేశంతో ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్ అండ్ డిసిప్లిన్) చట్టం 2023 తీసుకొచ్చింది కేంద్రం. ఆ చట్టానికి సంబంధించిన నిబంధనలను సైతం నోటిఫై చేసింది. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్-సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ (కమాండ్, కంట్రోల్ అండ్ డిసిప్లిన్) చట్టం 2023 కింద రూపొందించిన నియమాలపై తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మే 27 నుండి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లకు చెందిన కొన్ని విభాగాలలో ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి.
ఏకతాటిపైకి సాయుధ బలగాల కమాండ్, కంట్రోలింగ్
రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం.. భారత త్రివిధ బలగాలకు చెందిన కమాండ్, కంట్రోలింగ్ వ్యవస్థల పనితీరును బలోపేతం చేయడం, తద్వారా సాయుధ బలగాల మధ్య ఉమ్మడి తత్వాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఇందుకు సంబంధించి 2023 వర్షాకాల సమావేశం (Monsoon Session)లో పార్లమెంటు ఉభయ సభలు యూనిఫైడ్ బిల్లును ఆమోదించాయి. ఆగస్టు 15, 2023న ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దాంతో మే 08, 2024న విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ చట్టం మే 10, 2024న అమల్లోకి వచ్చింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఇటీవల భారత సైన్యానికి చెందిన నార్త్, వెస్ట్ సెంటర్లలో యుద్ధ సంసిద్ధతను వ్యూహాత్మకంగా సమీక్షించారు. ఈ విషయాన్ని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రధాన పాత్ర పోషించిన 2 కీలకమైన బలగాలను వేర్వేరుగా సందర్శించగా, జనరల్ చౌహాన్ మొత్తం సినర్జీని, సవాలుతో కూడిన పరిస్థితుల్లోనూ సకాలంలో పూర్తి చేయడాన్ని ప్రశంసించారు.
భారత సైన్యం ధైర్య, సాహసాలపై ప్రశంసలు
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా విధి నిర్వహణలో పాల్గొన్న సైనికుల ధైర్యసాహసాలను జనరల్ అనిల్ చౌహాన్ మెచ్చుకున్నారు. భారత బలగాల అన్ని శ్రేణుల శౌర్యం, సంకల్పం, ఖచ్చితత్వం మెరుగైన ఫలితాలను సాధించింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లోని ఉత్తర, పశ్చిమ సరిహద్దులకు బాధ్యత వహించే బలగాల నైపుణ్యానికి నిదర్శనంగా జనరల్ చౌహాన్ పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్‌కు శ్రీకారం చుట్టిన భారత్
పహల్గామ్‌లో ఏప్రిల్ 22న ఉగ్రవాద దాడి తర్వాత ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భారత్ మే 7 ఆపరేషన్ సిందూర్ కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారత సాయుధ బలగాలు పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు చేసి సక్సెస్ సాధించాయి. అనంతరం పాక్ బలగాలు రెండు రోజుల పాటు భారత సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగి డ్రోన్ దాడులకు యత్నించింది. అప్రమత్తమైన భారత్ వాటిని తిప్పికొట్టడంతో పాటు పాక్ లోని ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేసి మరీ దాడులు చేసి సత్తా చాటింది. భారత్ దాడులను ఎదుర్కోలేక పాకిస్తాన్ శాంతిమంత్రం పఠించింది. కాల్పుల విరమణ, సైనిక దాడులను ఉపసంహరించుకోవాలని కోరగా అందుకు భారత్ అంగీకరించింది. దాంతో మే 10న కాల్పుల విమరణ ఒప్పందం జరిగినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.