Union Minister Ram Mohan Naidu | న్యూఢిల్లీ: ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం పౌర విమానయాన శాఖ నిబంధనలు సడలించింది. సెక్యూరిటీ స్కానింగ్ అనంతరం భక్తులు పవిత్రమైన ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్ లోనే ప్రయాణించవచ్చు. మండలం నుంచి మకర జ్యోతి దర్శనం (జనవరి 20) వరకు కల్పించిన ఈ అవకాశాన్ని అయ్యప్ప భక్తులు (Sabarimala Devotees) వినియోగించుకోవాలి. అదే సమయంలో భద్రతా సిబ్బందికి సహకరించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


రామ్మోహన్ నాయుడు పోస్ట్ చేసిన వీడియో..
‘అందరికీ నమస్కారం. నేను మీ రామ్మోహన్ నాయుడును మాట్లాడుతున్నాను. అయ్యప్ప స్వామి భక్తులు ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి దీక్ష చేపట్టి, శబరిమల వరకు యాత్ర చేసి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున అయ్యప్ప మాల ధరిస్తుంటారు. ఆ స్వాములు శబరిమలకు రోడ్డు మార్గంలో, రైలు మార్గంలో గానీ లేక విమాన ప్రయాణం ద్వారా స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. అయితే విమానంలో ప్రయాణించే అయ్యప్ప స్వామి భక్తులు ఓ సమస్య ఎదుర్కొంటున్నట్లు నా దృష్టికి వచ్చింది. భద్రతా కారణాలతో అయ్యప్ప స్వాములు వెంట తెచ్చే ఇరుముడిని చెకిన్ చేయాల్సి ఉంటుంది. దాని వల్ల అయ్యప్ప మాల ధరించిన భక్తులకు ఇబ్బంది కలుగుతుంది.


పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా భక్తుల సౌకర్యార్థం చిన్న మార్పులు తీసుకొచ్చాం. ఇరుముడితో ప్రయాణించే భక్తులు ఆ ఇరుముడిని నేరుగా చేతితో విమానంలోనే తీసుకువెళ్లే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. మండలం నుంచి మకర జ్యోతి దర్శనం వరకు విమానంలో ప్రయాణించే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. వారి పవిత్ర దీక్షకు భంగం కలగకుండా స్వామి వారిని దర్శించుకోవాలని’ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయ్యప్ప భక్తులకు సూచించారు.






Also Read: ABP Southern Rising Summit: వేర్వేరు పార్టీలు అయితే ఆత్మీయంగా పలకరించుకోకూడదా ? - ఏబీపీ సమ్మిట్‌లో కేటీఆర్, రామ్మోహన్‌నాయుడు మధ్య ఏం జరిగింది ?