తమిళనాడులో ఏఐఏడీఎంకే పార్టీలో ద్వంద్వ నాయకత్వానికి తెరపడింది. కొద్ది రోజులుగా ఈ పార్టీలో ఓ పన్నీర్ సెల్వం - ఎడప్పాడి పళనిస్వామి మధ్య నాయకత్వ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకొనేందుకు చేసిన తీర్మానానికి కూడా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ పదవులను కూడా రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి కూడా ఆమోదం తెలిపారు. మొత్తం ఈ సమావేశంలో పళనిస్వామి వర్గం ప్రవేశపెట్టిన 16 తీర్మానాలకు ఆమోదం లభించింది. త్వరలోనే కొత్తగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని తీసుకొచ్చి అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు.


ఈ జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహణపై ముందు నుంచి ఉత్కంఠ నెలకొని ఉంది. చెన్నైలో నేడు (జూన్ 11) నిర్వహించతలపెట్టిన జనరల్ కౌన్సిల్ సమావేశానికి మద్రాస్ హైకోర్టు ఉదయం 9 గంటలకే అనుమతి ఇచ్చింది. ఇది జరిగిన కాసేపటికే సమావేశం జరిగింది. పార్టీలో కో ఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్ పదవులను రద్దు చేసి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు సోమవారం చెన్నైలో ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఎడప్పాడి పళనిస్వామి వర్గం ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశాన్ని నిర్వహించవద్దంటూ ఓ పన్నీర్ సెల్వం వర్గం హైకోర్టును ఆశ్రయించింది. 


ఓ పన్నీర్ సెల్వమ్, పార్టీ జనరల్ కౌన్సిల్ మెంబర్ పి.వైరముత్తు అలియాస్ అమ్మన్ వైరముత్తు, జస్టిస్ క్రిష్ణన్ రామసామి తదితరులు జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించవద్దంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాను పార్టీకి కో ఆర్డినేటర్ గా కొనసాగుతున్నానని, 2021 డిసెంబరు 6 న తాను ఏకపక్షంగా ఎన్నికయ్యానని, ఐదేళ్ల తర్వాతే తన పదవీకాలం ముగుస్తుందని పన్నీర్‌సెల్వం తన సివిల్ పిటిషన్ తో పాటు దరఖాస్తును దాఖలు చేశారు. జాయింట్ కోఆర్డినేటర్ ఎడప్పాడి కె పళనిస్వామితో పాటు ఆ సమయంలో ఓ పన్నీర్ సెల్వం ఈ పదవిని చేపట్టారు. అయితే, పార్టీలో ఇలా ద్వంద్వ నాయకత్వం ఉండడం వల్ల నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందికరంగా మారిందనే ఉద్దేశంతో కో ఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ పరదవులను రద్దు చేసి, ప్రధాన కార్యదర్శి పదవిని తిరిగి ఎన్నుకొని ఏక నాయకత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నాయకత్వం కోసమే ఈపీఎస్ - ఓపీఎస్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొని ఉంది.


తారస్థాయికి అంతర్గత పోరు
ఆ పదవులు రద్దు చేసేందుకు జూన్ 23న జరగాల్సిన జనరల్ కౌన్సిల్ సమావేశం ఆ రోజు ఉదయం 4:40 గంటలకు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు కారణంగా జరగలేదు. ఆ ఉత్తర్వును తర్వాత సుప్రీంకోర్టు నిలిపివేసింది. దీంతో ఓ పన్నీర్‌సెల్వం వర్గం ప్రత్యేకంగా జూలై 11న నిర్వహించే జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఆపాలని తాజాగా సివిల్ పిటిషన్ ను దాఖలు చేసింది. తాజాగా కోర్టు పన్నీర్ సెల్వంకు షాక్ ఇస్తూ పిటిషన్ ను తోసిపుచ్చింది.