ABP CVoter Madhya Pradesh Exit Poll 2023:
మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ABP CVoter Exit Poll అంచనా వేసింది. కాంగ్రెస్‌కి గత ఎన్నికల్లో 114 సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఆ సంఖ్య 125 వరకూ పెరిగే అవకాశముంది. బీజేపీ విషయానికొస్తే...గత ఎన్నికల్లో 109 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి 9 స్థానాలు తగ్గిపోయి 100 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. బీఎస్‌పీ గత ఎన్నికల్లో 2 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి కూడా అదే 2 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. మొత్తంగా చూస్తే...కాంగ్రెస్‌కి 113-137 సీట్లు వస్తాయని తెలిపింది. బీజేపీ 88-112 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 40.9% ఓట్లు దక్కాయి. ఈ సారి ఇది 44.1%కి పెరగనుంది. బీజేపీకి గత ఎన్నికల్లో 41% ఓట్లు సాధించగా..ఈ సారి స్వల్పంగా తగ్గి 40.7%కి పరిమితం కానుంది. మొత్తంగా చూస్తే...230 అసెంబ్లీ నియోజకవర్గాలున్న మధ్యప్రదేశ్‌లో బఘేల్‌ఖండ్, భోపాల్, చంబల్, మహాకౌశల్, మల్వా, నిమర్ ప్రాంతాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. బఘేల్‌ఖండ్‌లో 56 నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌కి 26-30 స్థానాలు వస్తాయని వెల్లడించింది. బీజేపీకి 23-27 సీట్లు వస్తాయని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. భోపాల్‌లో 25 నియోజకవర్గాలుండగా...అందులో కాంగ్రెస్ 9-13 స్థానాలు గెలుచుకుటుందని తెలిపింది.
ఇక చంబల్ ప్రాంతంలో 34 సీట్లలో 25-29 స్థానాలు కాంగ్రెస్‌కే వస్తాయని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఈ అంచనాల ప్రకారం బీజేపీ 4-8 సీట్లకే పరిమితం కానుంది. మహాకౌశల్ ప్రాంతంలో 42 నియోజకవర్గాలుండగా...అందులో కాంగ్రెస్‌కి 23-27 సీట్లు వచ్చే అవకాశముంది. బీజేపీకి 14-18 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ తెలిపింది. మల్వాలో 45 నియోజకవర్గాలుండగా అందులో కాంగ్రెస్‌కి 16-20, బీజేపీకి 23-27 స్థానాలు దక్కే అవకాశముంది. నిమర్‌లోని 28 నియోజకవర్గాలుండగా 14-18 సీట్లు వస్తాయని తెలిపింది. బీజేపీకి 10-14 సీట్‌లు వచ్చే అవకాశముందని అంచనా వేసింది ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్.
సినారియో-1
ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉంటే అది కాంగ్రెస్‌కి ప్లస్ కానుంది. 153-165 సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశముంది. బీజేపీ 60-72 స్థానాలకే పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీఎస్‌పీ 0-4 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయి.
సినారియో-2
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి సానుకూల ఓట్లు పడితే కాంగ్రెస్‌పై అది ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్ 96-108 స్థానాలకే పరిమితం కానుంది. బీజేపీ 117-129 స్థానాల్లో విజయం సాధించనుంది. బీఎస్‌పీ 0-4, ఇతరులు 0-5 సీట్లు గెలుచుకోనున్నారు.
ఒపీనియన్ పోల్ ఏం చెప్పిందంటే..?
మధ్యప్రదేశ్‌లో నిరుద్యోగం అంశం 31.0% మేర ప్రభావం చూపించనుందని గతంలో ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. విద్యుత్, రహదారులు, నీళ్లు లాంటి మౌలిక వసతులు 2.7% మేర ప్రభావం చూపించనున్నాయి. శాంతి భద్రతలతో పాటు మహిళా భద్రత అంశం 3.8% ప్రభావం చూపుతుందని ఈ పోల్‌లో వెల్లడైంది. అవినీతి ప్రభావం 4.9% మేర ఉండే అవకాశముందని తెలిపింది. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ 30.5% మేర ఉండనుంది. ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న వాళ్ల సంఖ్య 55.4%గా ఉంది. అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని మార్చే ఆలోచన లేని వాళ్ల సంఖ్య 6.1%గా తేలింది.