ఆయన వయసు 91 ఏళ్లు. ఢిల్లీలోని ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్నారు. ఆయన టైం అయిపోయిందని అధికారులు ఆయన రెక్క పట్టుకుని తీసుకు వచ్చి రోడ్డు మీద పడేశారు. ఆయన సామాన్లు వసతి గృహంలో ఉన్నవన్నీ తెచ్చి అక్కడ పెట్టేశారు. ఆయన ఎవరో సాదాసీదా వ్యక్తి అయితే...ఎవరూ పట్టించుకునేవారు కాదేమో కానీ ఆయన పద్మశ్రీ అవార్డు పొందిన ప్రముఖ వ్యక్తి. ప్రముఖ నృత్యకారుడు గురు మయుధర్‌ రౌత్‌ గత కొన్నేళ్లుగా.. ఢిల్లీలోని ఏషియన్‌ గేమ్స్‌ విలేజ్‌లో ప్రభుత్వం కేటాయించిన వసతి గృహంలో ఉంటున్నారు. ఆయనతోపాటు పలువురు ప్రముఖ కళాకారులు కూడా.. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్నారు.


 






గురు మయుధర్‌ రౌత్‌ ఆ వసతి గృహంలో ఉండటానికి సమయం అయిపోయిందని ఇక అక్కడ ఉండకూడదని ఏప్రిల్‌ 25 లోగా ఖాళీ చేయాలని అధికారులు కొద్ది రోజుల కిందట ఆదేశించారు. మయుధర్‌ రౌత్‌ తాను ఉంటున్న బంగళాను ఖాళీ చేయకపోవడంతో.. అధికారులు వచ్చి ఖాళీ చేయించారు. ఇంట్లోని సామానంతా రోడ్డున పడేశారు. ఆఖరికి పద్మశ్రీ పురస్కార పత్రం కూడా రోడ్డుపై వేశారు. ఇలా అతని సామాన్లను రోడ్డుపై కనిపించిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.


గురు మయుధర్ రౌత్ అలనాపాలనా ఆమె కుమార్తె చూసుకుంటున్నారు. అధికారులు ఇంట్లో సామాన్లన్నీ బయట పడేస్తున్న సమయంలో ఆమె కూడాఉన్నారు.  అదృష్టవశాత్తూ.. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. లేదంటే మానాన్న మరణించేవారే. తన నాట్యంతో ఎన్నో సేవలందించిన మా నాన్నకి ఇలాంటి అవమానం జరగడం బాధాకరం. ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన బ్యాక్‌ ఎకౌంట్‌లో కేవలం రూ. 3,000 రూపాయలే ఉన్నాయి. ఇలాంటి ఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఖాళీచేసే ఉద్దేశంలో ఉన్నామని తమ నాదన వినిపించుకోలేదని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.


ఒరిస్సా వృద్ధ కళాకారుని పట్ల ఇంత దారుణంగా ప్రవర్తించడాన్ని అనేక మంది ఇతర కళాకారులు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.