న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాదులు ముగ్గురిని భారత ఆర్మీ హతం చేసిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో రెండో రోజు జరుగుతున్న ప్రత్యేక చర్చలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకున్నాం అన్నారు. పహల్గాంలో 26 మంది అమాయకులను ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ఈ నెల 22న శాటిలైట్ ఫోన్ సిగ్నల్ ద్వారా పహల్గాం ఉగ్రవాదుల ఆచూకీ తెలిసింది. ఆపరేషన్ మహదేవ్ చేపట్టి ముగ్గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ మట్టుపెట్టిందని వివరించారు.
వాళ్లు పాకిస్తాన్ ఉగ్రవాదులే.. అమిత్ షా
"జమ్మూకాశ్మీర్ శ్రీనగర్‌లో చేపట్టిన ఆపరేషన్ మహదేవ్‌లో భాగంగా జరిగిన ఎన్ కౌంటర్‌లో సులేమాన్, అఫ్ఘాన్, జిబ్రన్ అనే ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరికి ఆహారం సరఫరా చేసిన వారిని, ఆశ్రయం కల్పించిన వారిని ముందే అదుపులోకి తీసుకున్నాం. ఈ ఉగ్రవాదుల మృతదేహాలను శ్రీనగర్‌కు తీసుకువచ్చిన తరువాత స్వాధీనం చేసుకున్నాం. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిందే ఆపరేషన్ మహదేవ్’ అని షా సభలో వెల్లడించారు. నిందితుల వద్ద పాకిస్తాన్ చాక్లెట్లు లభించాయని, వారిది పాకిస్తానే అని స్పష్టం చేశారు.
పాక్ డీజీఎంకు సమాచారం ఇచ్చాం..
"ఆపరేషన్ సిందూర్ తర్వాత, మా DGMO పాక్ డిజిఎంఓకు సమాచారం అందించింది. భారతదేశం ఆత్మరక్షణలో భాగంగా వారి భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిందని తెలిపాం. మే 7న రాత్రి అర్ధరాత్రి 1.04 నుంచి 1.24 గంటల మధ్య ఆపరేషన్ సిందూర్ జరిగింది. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత బలగాలు 100 మందికి పైగా ఉగ్రవాదులను హతం చేశాయి. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులు వచ్చి మమ్మల్ని చంపిన తర్వాత ఏ చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారతదేశాన్ని రక్తసిక్తం చేసిన ఉగ్రవాదులను మోదీ హయాంలో మేం హతం చేశాం. పాక్ లోకి వెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాం" అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అమిత్ షా
అంతకుముందు అమిత్ షా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆపరేషన్ మహదేవ్ గురించి వివరించారు. "ఆపరేషన్ మహాదేవ్ సులేమాన్ అలియాస్ ఫైజల్, అఫ్ఘాన్, జిబ్రన్ అనే ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్‌పిఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో మట్టుపెట్టారు. సులేమాన్ లష్కరే తోయిబాకు చెందిన ఎ-కేటగిరీ కమాండర్. అఫ్ఘాన్, జిబ్రన్‌లు సైతం లష్కరే తోయిబాకు చెందిన ఎ-కేటగిరీకి చెందిన ఉగ్రవాదులు. బైసరన్ లోయ పహల్గాంలో కాల్పులు జరిపి అమాయక పౌరులను హతమార్చిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు" అని ఆయన పేర్కొన్నారు.