పంజాబ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని మంత్రివర్గంలో పది మంది మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల్లో ఎనిమిది మంది తొలిసారి ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. టీంలోకి ఓ మహిళను కూడా తీసుకున్నారు. 


పంజాబ్ అసెంబ్లీ స్పీకర్‌గా కుల్తార్ సింగ్ సంధ్వన్‌ను నామినేట్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయించినట్లు పిటిఐ పేర్కొంది. 


పంజాబ్ రాజ్ భవన్‌లో మాన్ మంత్రివర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.


మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న 10 మంది పార్టీ ఎమ్మెల్యేల పేర్లను తెలుపుతూ భగవంత్ మాన్ నిన్న ఓ ట్వీట్ చేశారు. వాళ్ల ఫొటోలు ట్వీట్‌ చేసి వాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.


పది మందిలో ఐదుగురు ఎమ్మెల్యేలు మాల్వా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నలుగురు మాజా, ఒక శాసనసభ్యుడు దోబా నుంచి ఎన్నికయ్యారు.  దిర్బా, జండియాలా, మలౌట్, భోవా వంటి రిజర్వ్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తు నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 







ప్రమాణ స్వీకారం చేసిన 10 మంది పంజాబ్ మంత్రుల వివరాలు:


హర్పాల్ సింగ్ చీమా: దిర్బా నుంచి రెండోసారి ఎమ్మెల్యే అయిన దళిత నేత. గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన శిరోమణి అకాలీదళ్‌కు చెందిన గుల్జార్ సింగ్ మూనాక్‌పై 50,655 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


2017లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఎస్సీ, ఎస్టీలు, బీసీల సంక్షేమానికి సంబంధించిన అసెంబ్లీ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు.


గుర్మీత్ సింగ్ మీట్ హయర్: రెండుసార్లు బర్నాలా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆప్ యువజన విభాగం అధ్యక్షుడు. అతను ఎస్‌ఏడీ లీడర్ కుల్వంత్ సింగ్ కీతుపై 37,622 ఓట్ల తేడాతో విజయం సాధించారు.


డాక్టర్ బల్జిత్ కౌర్: భగవంత్ మాన్ మంత్రివర్గంలోని ఏకైక మహిళా మంత్రి.  మలౌట్ నుంచి ఎన్నికయ్యారు. కంటి శస్త్రచికిత్స నిపుణురాలు. ఆమె 2014 నుంచి 2019 వరకు ఫరీద్‌కోట్ ఎంపీగా ఉన్న సాధు సింగ్ కుమార్తె.
ముక్త్‌సర్‌ జిల్లాలోని మలౌట్‌ నుంచి ఎస్‌ఏడీ అభ్యర్థి హర్‌ప్రీత్‌ సింగ్‌పై 40,261 ఓట్లతో విజయం సాధించారు.


హర్జోట్ బెయిన్స్: ఆనంద్‌పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి హర్జోత్ బైన్స్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి రాణా కేపీ సింగ్‌పై విజయం సాధించారు. 


డాక్టర్ విజయ్ సింగ్లా: మాన్సా ఎమ్మెల్యే విజయ్‌ సింగ్లా దంతవైద్యుడు. ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ అభ్యర్థి శుభదీప్ సింగ్‌ను 63,323 ఓట్ల భారీ తేడాతో ఓడించారు.


హర్భజన్ సింగ్: పంజాబ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుఖ్వీందర్ సింగ్ డానీని ఓడించి జండియాలా నుంచి గెలుపొందారు. హర్భజన్ 2017లో ఈ స్థానం నుంచి పోటీ చేసి విఫలమయ్యారు. 


లాల్ చంద్ కటారుచక్: ఆప్‌ ఎస్సీ విభాగానికి అధ్యక్షుడు. పఠాన్‌కోట్‌లోని భోవా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జోగిందర్ పాల్‌పై లాల్ చంద్ విజయం సాధించారు.


కుల్దీప్ సింగ్ ధాలివాల్: అజ్నాలా ఎమ్మెల్యే ఎస్‌ఏడీ అభ్యర్థి అమర్‌పాల్ సింగ్‌ను ఓడించారు. ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమృత్‌సర్ నుంచి పోటీ చేశారు.


లల్జిత్ సింగ్ భుల్లర్: మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అల్లుడు అయిన రాజకీయ ప్రముఖుడు ఆదేశ్ పర్తాప్ సింగ్ కైరోన్‌ను ఓడించి పట్టి స్థానం నుంచి గెలుపొందాడు. లల్జిత్ భుల్లర్ 2019లో ఆప్‌లో చేరారు.


బ్రహ్మ శంకర్: హోషియార్‌పూర్ స్థానం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే, మాజీ మంత్రి,  కాంగ్రెస్ అభ్యర్థి సుందర్ శామ్ అరోరాను ఓడించారు. 


ప్రమాణ స్వీకారం తర్వాత కొత్త మంత్రులు పంజాబ్ సివిల్ సెక్రటేరియట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆప్ ప్రభుత్వ మొదటి కేబినెట్ సమావేశం మధ్యాహ్నం జరుగుతుందని వర్గాలు తెలిపాయి.


రెండుసార్లు ఆప్ ఎమ్మెల్యేలుగా ఉన్న అమన్ అరోరా, బల్జిందర్ కౌర్, సర్వజిత్ కౌర్‌ను కూడా మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.