India votes against Russia: 


ఓటింగ్‌కు దూరంగా చైనా 


రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఆర్నెల్లు అవుతోంది. ఇంకా ఈ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి ఎన్నో సార్లు రష్యాను యుద్ధం ఆపేయాలని సూచించినా...పుతిన్ మాట వినలేదు. ఐరాస సభ్య దేశాలు రష్యాకు వ్యతిరేకంగా నినదిస్తున్నా...భారత్ మాత్రం ఇన్నాళ్లూ మౌనంగా ఉంది. గతంలో నిర్వహించిన ఓటింగ్‌లోనూ పాల్గొనలేదు. అయితే...తొలిసారి భారత్..రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో ఈ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిచేందుకు అనుకూలంగా నిలిచింది భారత్. ఆర్నెల్ల క్రితం రష్యా...ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి భారత్ తటస్థ వైఖరినే అవలంబిస్తోంది. ఈ సారి మాత్రం చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చైనా ఈ ఓటింగ్‌కు దూరంగా ఉంది. 


యుద్ధ పరిస్థితులపై సమీక్ష 


ఉక్రెయిన్‌ 31వ  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో...యుద్ధ పరిస్థితులను సమీక్షించారు. ఈ సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దీనిపై రష్యా నిరసన వ్యక్తం చేసింది. ప్రొసీజరల్ ఓటింగ్‌ను కోరింది. ఫలితంగా...మండలి ఓటింగ్ నిర్వహించింది. మొత్తం 15 దేశాల్లో 13 దేశాలు జెలెన్‌స్కీ ప్రసంగానికి అనుకూలంగా ఓటు వేశాయి. రష్యా మాత్రమే వ్యతిరేకించింది. ఆ తరవాత జెలెన్‌స్కీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.