India Pakistan ceasefire extended :భారతదేశం , పాకిస్తాన్ కాల్పుల విరమణను పొడిగించడానికి అంగీకరించాయని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ ప్రకటించారు. రెండు దేశాల సైనిక జనరల్స్ మధ్య జరిగిన ఫోన్ చర్చల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణను పొడిగించడానికి అంగీకరించిందని దార్ ప్రకటిచారు. ఆదివారం వరకు కాల్పుల విరమణ అమలులో ఉంటుంది. పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి కూడా అయిన ఇషాక్ దార్ సెనేట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. మే 14న రెండు వైపులా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్య హాట్‌లైన్ సంప్రదింపుల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
డీజీఎంవోల చర్చల్లో కాల్పుల విరమణ పొడిగింపు నిర్ణయం
“DGMOల సంభాషణ సందర్భంగా, కాల్పుల విరమణను మే 12 వరకు పొడిగించారు. మే 12న DGMOలు మళ్ళీ మాట్లాడినప్పుడు, కాల్పుల విరమణను మే 14 వరకు పొడిగించారు. మే 14న జరిగిన తదుపరి చర్చలు, కాల్పుల విరమణను మే 18 వరకు పొడిగించడానికి అంగీకరించారు అని ” అని ఇషాక్ దార్ గురువారం ఎగువ సభకు తెలిపారు.
బలగాలను తగ్గించాలని నిర్ణయం
ఆపరేషన్ సిందూర్ తర్వాత అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు యుద్ధానికి సిద్ధమవ్వడంతో భారత్, పాక్ శాంతించాలని చర్చలు జరుపుకోవాలని పలు దేశాలు సూచించాయి. ఇరు దేశాలు కాల్పుల విమరణకు అంగీకరించాయి. డీజీఎంవోల మధ్య చర్చల్లో ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపకూడదని, కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు. శత్రుత్వ చర్యలు తీసుకోకూడదనే విషయాలకు కట్టుబడి ఉండాలనే దానిపై చర్చించారు. అదేవిధంగా సరిహద్దులు, ఫార్వర్డ్ బేస్ ప్రాంతాల్లో బలగాల తగ్గింపును పరిగణించాలని నిర్ణయించారు.
హఠాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించిన ఇరు దేశాలు
భారత సైన్యం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత మే 8, 9, 10 తేదీల్లో పాకిస్థాన్.. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్‌లు, క్షిపణి దాడులకు విఫలయత్నం చేయగా.. పాక్ కుట్రలను భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో తలెత్తిన ఉద్రిక్తతల మధ్య ఇరుదేశాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. ఇది తీవ్ర స్థాయి యుద్ధానికి దారి తీస్తుందని అనుకున్నారు కానీ.. కాల్పుల విరమణతో ఆగిపోయింది.