India first bullet train launch date August 15 2027: భారతదేశ కలల ప్రాజెక్టు అయిన బుల్లెట్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లాంఛింగ్ తేదీని ప్రకటించారు. 2027 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున బుల్లెట్ ట్రైన్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ (MAHSR) కారిడార్‌లో తొలి బుల్లెట్ రైలు కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. 2027 స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశానికి తొలి బుల్లెట్ రైలు వస్తుంది.. ఆ రోజే టికెట్ కొనుక్కోవడానికి సిద్ధంగా ఉండండి అని రైల్వే మంత్రి ప్రకటించారు. తొలుత ఈ ప్రాజెక్టు 50 కిలోమీటర్లకే పరిమితం అవుతుందని భావించినప్పటికీ, పనుల వేగం దృష్ట్యా గుజరాత్‌లోని సూరత్ నుంచి వాపి వరకు సుమారు 100 కిలోమీటర్ల మేర ఈ ప్రారంభ ప్రయాణం సాగనుంది. మొత్తం 508 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును కేంద్రం ఐదు దశల్లో పూర్తి చేయనుంది.
1. మొదటి దశ: సూరత్ నుండి బిలిమోరా వరకు.2. రెండో దశ: వాపి నుండి సూరత్ వరకు.3. మూడో దశ: వాపి నుండి అహ్మదాబాద్ వరకు.4. నాల్గవ దశ: థానే నుండి అహ్మదాబాద్ వరకు.5. చివరి దశ:* ముంబై (BKC) నుండి అహ్మదాబాద్ వరకు పూర్తి కారిడార్.మొత్తం 508 కిలోమీటర్ల మేర పూర్తిస్థాయిలో బుల్లెట్ రైలు సేవలు డిసెంబర్ 202 నాటికి అందుబాటులోకి రానున్నాయి.
సరికొత్త ప్రయాణ అనుభవం
ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రయాణానికి దాదాపు 6 నుండి 8 గంటల సమయం పడుతుండగా, బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఆ సమయం కేవలం 1 గంట 58 నిమిషాలకు తగ్గిపోనుంది . అన్ని స్టేషన్లలో ఆగినప్పటికీ 2 గంటల 17 నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ రైళ్ల కోసం అత్యాధునిక జపనీస్ షింకన్సెన్ సాంకేతికతను వాడుతున్నారు.
ఈ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉండగా, అందులో 8 గుజరాత్‌లో, 4 మహారాష్ట్రలో ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న నివేదికల ప్రకారం, సుమారు 326 కిలోమీటర్ల మేర వయాడక్ట్ పనులు, 17 నది వంతెనల నిర్మాణం పూర్తయ్యాయి. ముఖ్యంగా థానే సమీపంలో సముద్రం కింద నిర్మిస్తున్న 21 కిలోమీటర్ల పొడవైన సొరంగం ప్రాజెక్టులో అత్యంత సవాలుతో కూడిన భాగంగా నిలుస్తోంది. జపాన్ ప్రభుత్వం దాదాపు 81 శాతం నిధులను తక్కువ వడ్డీకే రుణంగా అందిస్తోంది.