India China Clash:


ఎదురు నిలిచిన భారత్ సైన్యం..


రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత్ చైనా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గల్వాన్‌లోనే అయినా, తవాంగ్‌లో అయినా భారత సైన్యం తమ ధైర్యసాహసాలతో శత్రు సైన్యాన్ని ఎదుర్కొందని ప్రశంసించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. "గల్వాన్ అయినా తవాంగ్ అయినా మన భారత సైన్యం మాత్రం చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలిచింది. ధైర్య సాహసాలు చూపింది" అని కొనియాడారు. ఇదే సమయంలో భారత్, చైనా ఆర్థిక వ్యవస్థల్ని పోల్చి చెబుతూ భారత్ బలంగా ఉందన్న విషయాన్ని తేల్చి చెప్పారు. "1949లో భారత్ జీడీపీ చైనా కన్నా తక్కువ. 1980 వరకూ ప్రపంచంలోనే టాప్-10 ఆర్థిక వ్యవస్థల జాబితాలోనూ భారత్ లేదు. 2014లో భారత్ 9వ స్థానానికి చేరుకుంది. ఇప్పుడు 3.5 లక్షల కోట్ల ఎకానమీతో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది" అని స్పష్టం చేశారు రాజ్‌నాథ్ సింగ్. చైనాతో జరుగుతున్న ఘర్షణలపై అడుగుతున్న ప్రశ్నలకు కేంద్రం సరైన సమాధానం ఇవ్వడం లేదన్న ఆరోపణలు చేస్తున్నాయి  ప్రతిపక్షాలు. దీనిపైనా రాజ్‌నాథ్ స్పందించారు. "ప్రతిపక్షాల ఉద్దేశాలను, వారి అభిప్రాయాలను మేమెప్పుడూ ప్రశ్నించలేదు. విధానాల ఆధారంగానే మా వాదనలేంటో వినిపిస్తాం. నిజాలు మాట్లాడటమే మా రాజకీయం" అని వెల్లడించారు. భారత్- చైనా సైనికుల మధ్య అరుణాచల్‌ ప్రదేశ్‌ తవాంగ్‌ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవల ఘర్షణ జరిగింది. 
డిసెంబర్‌ 9న భారత్‌ భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా ఆర్మీ ప్రయత్నించగా.. డ్రాగన్‌ చర్యను భారత బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని మోదీ సర్కార్ తెలిపింది.