Best of Bharat People: 


ఉద్యమాగ్ని రగిలించిన రచయితలు..


భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది ప్రాణాలొదిలారు. మరెంతో మంది ఆంగ్లేయుల చేతిలో చిత్రహింసలు పడ్డారు. అయినా...ఆ సంకల్పం మాత్రం చెదరలేదు. బ్రిటీష్‌ అరాచకాలకు బెదరలేదు. కలిసి పోరాడారు. స్వాతంత్య్రం సంపాదించుకున్నారు. ఈ ఉద్యమంలో కొందరు ప్రత్యక్షంగా పాల్గొని స్ఫూర్తినిచ్చిన వారు కొందరైతే...పరోక్షంగా ప్రజల్లో చైతన్యం వాళ్లు మరి కొందరు. వీరిలో కవులు, రచయితలూ ఉన్నారు. తమ రచనలతో ప్రజల్లో ఉద్యమాగ్నిని రగిలించారు. స్వాతంత్య్ర పోరాటాన్ని ఇవి మలుపు తిప్పటమే కాకుండా, కొత్త బాటలనూ వేశాయి. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా, భారతీయులందరినీ ఒక్కటి చేసే శక్తినిచ్చారు..ఆ రచయితలు, కవులు. కొందరు నేరుగా ఉద్యమంలోనూ పాల్గొన్నారు. భారత్‌కు స్వేచ్ఛా వాయువులు ఇవ్వటంలో వీరి పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిదే. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా ఆ రచయితలను ఓ సారి గుర్తు చేసుకుందాం. 


1. రవీంద్రనాథ్ ఠాగూర్: 


ప్రజల్లో స్వాతంత్య్ర ఆకాంక్షను, ఆవేశాన్ని నింపిన రచయితల్లో ముందు వరుసలో ఉంటారు నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్. కవిత్వం, కథలు, నాటకాలు, వ్యాసాలు. ఇలా అన్ని ప్రక్రియల్లోనూ దేశభక్తిని పెంపొందించే రచనలు చేశారు ఠాగూర్. ముఖ్యంగా ఆయన రాసిన
కవిత్వం...ఎంతో మందిని కదిలించింది. పాటలు యువతలో చైతన్యం తీసుకొచ్చింది. ఆయనకు నైట్‌హుడ్ పురస్కారం లభించినప్పటికీ... జలియన్ వాలాబాగ్ ఘటన తరవాత ఈ అవార్డ్‌ని తిరస్కరించారు. ఈ అరాచకానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. దేశానికి జనగణమన జాతీయ గీతాన్ని అందించి చిరస్థాయిగా నిలిచిపోయారు. 


2. బంకించంద్ర ఛటర్జీ: 


ఠాగూర్ తరవాత ఆ స్థాయిలో తన రచనలతో ప్రభావితం చేసిన వ్యక్తి బంకించంద్ర ఛటర్జీ. జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రచిస్తే, జాతీయ గేయం "వందేమాతరం"ను ఛటర్జీ రచించారు. ఈ బెంగాలీ రచయిత...తన పెన్‌ పవర్‌తో బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పట్టించారు. 1874లో రాసిన వందేమాతర గీతం...స్వాతంత్య్రోద్యమాన్ని మలుపు తిప్పింది. ఆంగ్లేయులపై పోరాటానికి ఇదే నినాదంగా మారింది. భారతీయులందరిలోనూ నరనరాల్లో జీర్ణించుకుపోయింది ఈ గేయం. తరవాత ఈ గేయాన్ని "ఆనంద్‌మఠ్" అనే నవల్లోనూ ప్రచురించారు. అసలు సిసలు జాతీయవాదాన్ని ప్రజల్లో మేల్కొలిపిన ఈ నవల చరిత్రాత్మక మార్పు తీసుకొచ్చింది. 


3. సుభద్ర కుమారి చౌహాన్


స్వాంతత్య్రోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న రచయితల జాబితాలో సుభద్ర కుమారి చౌహాన్‌ పేరు ముందుంటుంది. భగత్‌సింగ్‌తో పాటు మరి కొందరు సమరయోధులతో సన్నిహితంగా పని చేశారు చౌహాన్. అప్పటికే విప్లవ రచనల్లో ఆరితేరిన సుభద్ర కుమారి చౌహాన్, భగత్‌ సింగ్‌ పరిచయంతో ఆ మోతాదుని ఇంకాస్త పెంచారు. బ్రిటీష్‌ వాళ్లకు వ్యతిరేకంగా కాస్త ఘాటైన వ్యాసాలు..వార్తాపత్రికల్లో మ్యాగజైన్స్‌లో  ఆమె రాసేవారు. ప్రజల్ని తన రచనల ద్వారా చైతన్య పరిచారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్‌పై ఆమె రాసిన కవిత్వం అప్పట్లో సంచలనం కలిగించింది. 


4. రామ్ ప్రసాద్ బిస్మిల్ 


రామ్ ప్రసాద్ బిస్మిల్ పేరు వినగానే...కకోరీ ఘటనే గుర్తుకొస్తుంది. అప్పట్లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా బిస్మిల్ నేతృత్వంలోనే ఈ సంఘటన జరిగింది. ఈ చర్యతో దేశ యువతలో ఒక్కసారిగా ఉద్యమజ్వాల రగిలింది. "సర్ఫరోష్‌ కీ తమన్నా అబ్ హమారే దిల్‌ మే హై" అని ఆయన రాసిన గీతం అప్పట్లో ఓ సంచలనం. ఇప్పటికీ యువత ఈ పాటను ఏదో ఓ సందర్భంలో పాడుకుంటూనే ఉంటుంది. 


5. శ్యామలాల్ గుప్తా 


జర్నలిస్ట్‌గా, సామాజిక కార్యకర్తగా శ్యామలాల్ గుప్తా...స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన రచించిన "విజయ్ విశ్వ తిరంగ ప్యారా" గీతం అప్పట్లో ప్రతి ఉద్యమకారుడిని ధైర్యంగా ముందుకు నడిపించింది. 


6.మహమ్మద్ ఇక్బాల్ 


"సారే జహాసే అచ్ఛా, హిందుస్థాన్ హమారా" అని మనం పాడుకునే ఈ  గీతాన్ని రాసి, స్వరపరిచింది మహమ్మద్ ఇక్బాల్. ముస్లిం కమ్యూనిటీకి ప్రతినిధిగా, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడటంలో ఆయన రచనలు ముఖ్య పాత్ర పోషించాయి. వీరితో పాటు మైథిలీ శరణ్ గుప్తా, భరతేందు హరీశ్‌చంద్ర, మున్షీ ప్రేమ్‌చంద్ర, రామ్‌ధారీ సింగ్ దిన్‌కర్ లాంటి రచయితలూ తమ కలంతో ఆంగ్లేయుల పాలనపై పోరాడారు. 


Also Read: Independence Day 2022 : మనకు తెలియని మన స్వాతంత్య్ర యోధులు - ఎంత మంది తెలుగు వీరులో తెలుసా ?


Also Read: Independence Day 2022 : భారత వాటర్ వారియర్స్ - వీరి స్ఫూర్తి లక్షల మంది దాహం తీరుస్తోంది !