Uddhav Thackeray:



రిజైన్ చేయాల్సిందే..


శివసేన వర్సెస్ శివసేన కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై రెండు వర్గాలూ సానుకూలంగానే స్పందించాయి. ఇదే సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు శిందే, ఉద్దవ్ థాక్రే. శివసేన తమదే అంటున్న ఉద్దవ్ థాక్రే..సీఎం శిందేపై ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా ఏక్‌నాథ్ శిందే తీరు మార్చుకోవాలని సూచించారు. నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేవేంద్ర ఫడణవీస్ కూడా డిప్యుటీ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్‌తో పాటు డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్‌...థాక్రేతో భేటీ అయ్యారు. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన...ఈ డిమాండ్‌లు చేశారు. వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారని విమర్శించారు. 


"మహారాష్ట్ర ముఖ్యమంత్రి శిందే, డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కి ఏ మాత్రం నైతికత ఉన్నా వెంటనే ఆ పదవులకు రాజీనామా చేయాలి. శిందే వర్గంలోని ఎమ్మెల్యేలంతా కుమ్మక్కై కుట్ర చేశారు. పార్టీకి, మా నాన్నకు వెన్నుపోటు పొడిచారు. అప్పుడు నేను రాజీనామా చేయడం న్యాయపరంగా తప్పే కావచ్చు. కానీ అది నా నైతికతకు సంబంధించిన విషయం అని ఇప్పటికీ నేను బలంగా నమ్ముతున్నాను"


- ఉద్దవ్ థాక్రే, బాలాసాహెబ్ థాక్రే శివసేన నేత 






అసెంబ్లీలో బలపరీక్షకు రావాలని పిలిచే హక్కు గవర్నర్‌కు లేదని తేల్చి చెప్పారు థాక్రే. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందని అని వెల్లడించారు. 


"నేను రాజీనామా చేయకపోయుంటే మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అవకాశం ఉండేదని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ నా పోరాటం నా కోసం కాదు. ఈ రాష్ట్ర ప్రజల కోసం. దేశ ప్రజల  కోసం. రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే మా పోరాటం. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం మా కనీస బాధ్యత"


- ఉద్దవ్ థాక్రే, బాలాసాహెబ్ థాక్రే శివసేన నేత