Hyderabad IPS Officer Family Arrest: హైదరాబాద్ లో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కుటుంబాన్ని పోలీసులు అరెస్టు చేయడం  సంచలనంగా మారింది. ఆయన ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారికి చెందిన ఇంటిని కబ్జా చేయబోయినట్లుగా ఆరోపణలు వచ్చాయి. బాధిత అధికారి ఫిర్యాదు చేయడంతో సీసీఎస్ పోలీసులు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. విశ్రాంత ఐఏఎస్‌ భన్వర్‌ లాల్‌ కు జూబ్లీహిల్స్ లో ఓ నివాసం ఉంది. దానిలో నవీన్ కుమార్ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే, నకిలీ డాక్యుమెంట్ల క్రియేట్ చేసి ఇల్లు సొంతం చేసుకోవాలని ఐపీఎస్ అధికారి పన్నాగం పన్నినట్లుగా బాధితులు తెలిపారు. భన్వర్ లాల్ భార్య మనీలాల్‌ ఫిర్యాదు మేరకు ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్‌, ఐపీఎస్‌ అధికారి నవీన్‌ కుమార్‌ను పోలీసులు నిందితులని గుర్తించారు.


బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2014లో జూబ్లీహిల్స్‌లోని నివాసాన్ని ఓర్సు సాంబశివరావు ఐదేళ్లకు రెంటల్‌ అగ్రిమెంట్‌ చేశారు. 2019లో అగ్రిమెంట్‌ గడువు ముగిసిన తర్వాత కూడా ఆయన ఖాళీ చేయలేదు. అయినా రెంటల్‌ అగ్రిమెంట్‌ ముగిసినప్పటికీ అందుకు విరుద్ధంగా నవీన్‌ కుమార్‌ అదే ఇంట్లో ఉన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి సంతకాలను కూడా ఫోర్జరీ చేశారు. తమ ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారని విశ్రాంత ఐఏఎస్ అధికారి భన్వర్ లాల్ కుటుంబం ఆరోపిస్తోంది. 


ఈ ఫిర్యాదును గత నెల 17న భన్వర్ లాల్ భార్య మనీలాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఓర్సు సాంబశివరావు, అతని భార్య రూపా డింపుల్‌ను డిసెంబరు 22న అరెస్టు చేశారు. అప్పటినుంచి ఐపీఎస్‌ అధికారి నవీన్‌ కుమార్‌ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఐపీఎస్ అధికారి అయిన నవీన్‌ కుమార్‌ ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీలో జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.