Tamil Nadu Vijay poll promises : తమిళనాడు రాజకీయాల్లో జననాయగన్ గా ఎదగాలని ఆశిస్తున్న స్టార్ హీరో విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కళగం పార్టీ పెట్టి సంచనల విజయం సాధించారు. ఆయన మేనిఫెస్టో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఉచిత విద్యుత్, రుణమాఫీ, మహిళలకు నగదు బదిలీ వంటి ఆకర్షణీయమైన హామీలను ఆయన గుప్పించారు. అయితే, ఈ హామీలన్నీ అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ. 1 లక్ష కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా. ఇప్పటికే భారీ అప్పుల్లో ఉన్న తమిళనాడు ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయాలు ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మహిళలకు నెలవారీ సాయానికే రూ.47 వేల కోట్లు అవసరం
విజయ్ ప్రకటించిన హామీలలో అత్యంత భారీ వ్యయంతో కూడుకున్నది మహిళలకు ఇచ్చే నెలవారీ నగదు సాయం. రాష్ట్రంలోని దాదాపు 1.57 కోట్ల మంది మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏటారూ. 47,100 కోట్ల భారం పడనుంది. దీనికి తోడు రాష్ట్రంలోని 1.85 కోట్ల కుటుంబాలకు ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు, దీనికి ఏడాదికి రూ. 9,990 కోట్లు ఖర్చవుతుంది.
రైతులకు, విద్యార్థలుకు ఏటా రూ. 15వేల సాయం
రైతులు , వ్యవసాయ కూలీల కోసం కూడా టీవీకే భారీ పథకాలను ప్రకటించింది. 79.4 లక్షల మంది రైతులకు ఏడాదికి రూ. 15,000 చొప్పున ఆదాయ మద్దతు రూ. 11,910 కోట్లు, అలాగే 96 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 10,000 చొప్పున ఆర్థిక సాయం రూ. 9,600 కోట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 56.25 లక్షల మంది విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ. 15,000 గ్రాంట్ ఇస్తామని విజయ్ వాగ్దానం చేశారు, దీని వ్యయం సుమారు రూ. 8,438 కోట్లు.
నిరుద్యోగ భృతి సహా అనేక హామీలు
నిరుద్యోగ యువతను ఆకట్టుకునేలా.. 5 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ నెలకు రూ. 8,000 నుండి రూ. 10,000 , 10 లక్షల మందికి నెలకు రూ. 4,000 నిరుద్యోగ భృతిని ప్రతిపాదించారు. వీటివల్ల ఖజానాపై మరో రూ. 10,200 కోట్ల అదనపు భారం పడనుంది. వీటితో పాటు మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం, ఆరోగ్య బీమా ప్రీమియం పెంపు వంటి మరిన్ని పథకాలు కూడా విజయ్ మేనిఫెస్టోలో ఉన్నాయి.
ఏడాదికి లక్ష కోట్లు పైనే ఖర్చు చేయాలి
గణాంకాల ప్రకారం చూస్తే, విజయ్ హామీల మొత్తం ఖర్చు రూ. 1 లక్ష కోట్లు దాటుతుంది. ఇది గత స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఖర్చు చేస్తున్న రూ. 65,000 కోట్ల కంటే సుమారు 52 శాతం ఎక్కువ. తమిళనాడు మొత్తం రెవెన్యూ రాబడులు రూ. 3.31 లక్షల కోట్లు లో విజయ్ ప్రతిపాదించిన సంక్షేమ ఖర్చులే దాదాపు 30 శాతం వాటాను ఆక్రమిస్తాయి. కేవలం ప్రసంగాల వరకే కాకుండా, ఆచరణలోకి వచ్చేసరికి ఈ భారీ ఆర్థిక సవాలును విజయ్ ఎలా అధిగమిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
