CNG Car Uses | పెట్రోల్ ధరల పెరుగుదలతో పాటు బంకుల వద్ద క్యూ సమస్యలు లేకుండా ఉండాలని కార్ల ఓనర్లు భావిస్తుంటారు. ఇంధన ధరలతో కార్ల మెయింటైన్స్ మీ బడ్జెట్‌లో మార్పులు తెస్తుంది. అందుకే తమ పెట్రోల్ కారును సిఎన్‌జి (CNG)లోకి మార్చుకోవాలని కార్ల యజమానులు ఆలోచిస్తున్నారు. పెట్రోల్‌తో పోలిస్తే సిఎన్‌జి(CNG) కారు మెయింటైన్ చేయడానికి ఖర్చు చాలా తక్కువ. మైలేజీ కూడా మెరుగ్గా ఉంటుంది. మీ దగ్గర పెట్రోల్ కారు ఉండి, దానిని సిఎన్‌జిలోకి మార్చుకోవాలనుకుంటే, అందుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు తెలుసుకోవాలి. దాంతోపాటు ఆ ప్రక్రియకు అయ్యే, ఖర్చులు, ఇతర విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
అసలు విషయం ఏంటంటే.. అన్ని పెట్రోల్ కార్లలో CNG కిట్‌ను అమర్చలేరని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న వాహనాలలో మాత్రమే సీఎన్‌జి కిట్‌ను ఫిక్స్ చేయవచ్చు. సాధారణంగా చిన్న హ్యాచ్‌బ్యాక్, సెడాన్క, చాలా ఎస్‌యువి (SUV)లలో సిఎన్‌జి కిట్‌ను ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే, చాలా పాత కార్లలో లేదా ఇంజిన్ సరిగ్గా లేని వాహనాలలో సిఎన్‌జి వేయించడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే సీఎన్‌జీ కిట్ వేయించే ముందు కారు కండీషన్, ఇంజిన్‌ను చెక్ చేయించాలి.
ఈ ప్రక్రియకు ఖర్చు ఎంత అవుతుంది?ఖర్చు విషయానికి వస్తే, పెట్రోల్ కారులో సీఎన్‌జీ కిట్ సెట్ చేయడానికి సాధారణంగా రూ. 35 వేల నుండి రూ. 80 వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ ధర కారు మోడల్, ఇంజిన్, ఉపయోగించే కిట్ క్వాలిటీపై ఆధారపడి ఉంటుంది. మంచి బ్రాండెడ్ సిఎన్‌జి కిట్ కొంచెం ఖరీదు అయినప్పటికీ, ఇది సురక్షితమైనది. ఎక్కువకాలం పాటు మన్నికగా ఉంటుంది. చాలామంది తక్కువ ధరకే లభించే కిట్‌లను తీసుకుని, తరువాత పొరపాటు చేశామని భావిస్తుంటారు. దీనివల్ల భవిష్యత్తులో ఇంజిన్, సేఫ్టీ పరంగా మీకు ఇబ్బందులు రావచ్చు.
సిఎన్‌జి కిట్‌ను ప్రభుత్వం గుర్తించిన, సర్టిఫైడ్ డీలర్ల వద్ద మాత్రమే అమర్చుకోవాలి. కిట్ వేయించిన తర్వాత దానికి సంబంధించిన బిల్లు, సర్టిఫికేట్ తీసుకోవడం తప్పనిసరి. ఆ తర్వాత కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)లో కూడా మార్పులు చేయించాలి. తద్వారా మీ కారు ఇంధన రకం పెట్రోల్ నుండి CNGగా మారుతుంది. దీనితో పాటు ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ఈ సమాచారం ఇవ్వాలి. లేకపోతే భవిష్యత్తులో క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బంది పడతారు.
సీఎన్‌జీ కారు మెయింటనెన్స్ ఖర్చులు ఎలా ఉంటాయి.. కారును సిఎన్‌జిలోకి మార్చడం వల్ల కలిగే ప్రయోజనం తక్కువ ఖర్చుతో కారు నడపవచ్చు. పెట్రోల్‌తో పోలిస్తే సిఎన్‌జి చాలా చౌకగా లభిస్తుంది. కారు నడిపే ఖర్చు తగ్గుతుంది. సిఎన్‌జి కారు కిలోమీటరుకు సుమారు రూ. 2 నుంచి రూ. 3 ఖర్చుతో నడుస్తుందని చెబుతుంటారు. సీఎన్‌జీ కారు వల్ల కాలుష్యం తగ్గుతుంది. మీ ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణానికి సైతం ఇది మేలు చేస్తుంది.
సీఎన్జీ వల్ల కలిగే నష్టాలు..
మీ పెట్రోల్ కారును సీఎన్జీగా మార్చడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. సిఎన్‌జి సిలిండర్ అమర్చడం వల్ల కారు బూట్ స్పేస్ తగ్గిపోతుంది. దాంతో మీరు లగేజీ పెట్టుకునే స్పేస్ పోతుంది. అలాగే కొన్ని కార్లలో పికప్, పెర్ఫార్మెన్స్ కొంచెం తగ్గినట్లు అనిపించవచ్చు. ఒకవేళ కిట్ సరిగ్గా అమర్చకపోతే ఇంజిన్, ECU సంబంధిత సమస్యలు వస్తాయి. చాలా కంపెనీలు బయట సిఎన్‌జి కిట్ వేయిస్తే కారు వారంటీని రద్దు చేస్తాయి. అందుకే కొత్త కారు కొనేటప్పుడు చాలామంది ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి మోడల్ తీసుకోవాలని సూచిస్తారు.
