Russian woman spent 8 years in Karnataka forests:  కర్ణాటకలోని గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండల్లో ఒక గుహలో  జీవిస్తున్న  రష్యన్ మహిళ నీనా కుటినా, ఆమె ఇద్దరు కుమార్తెల ను పోలీసులు బయటకు తీసుకు వచ్చారు. ఆమె అక్కడకు వెళ్లి ఒకటి, రెండు రోజులు కాదు.. చాలా కాలం ఉన్నారు. దాదాపుగా ఎనిమిదేళ్లుగా ఆ గుహలు, అడవుల్లోనే జీవిస్తున్నారు. అందుకే ఆమె అక్కడ ఎలా బతికారన్న సందేహం ఆమె గురించి తెలిసిన వారికి వస్తోంది. 

నీనా కుటీనా 2016లో బిజినెస్ వీసాపై భారతదేశంలోకి ప్రవేశించారు. ఈ వీసా 2017 ఏప్రిల్‌లో గడువు ముగిసింది, ఆ తర్వాత ఆమె చట్టవిరుద్ధంగా దేశంలోనే ఉండిపోయింది. నీనా హిందూ ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితురాలై, గోవా ,  గోకర్ణలోని ఆధ్యాత్మిక సంఘాలలో చేరారు. హోటళ్లు , ఇతర ప్రాంతాల్లో బస చేయడం మానేసింది. అడవులు, గుహలు,  మరుమూల గ్రామాల్లో ఉండేందుకు ఆసక్తి చూపించింది. నీనా ఇద్దరు కుమార్తెలు ఇండియాలోనే పుట్టారు. వారిద్దరి పేర్లు ప్రేమ, అమా,  వారిలో ఒకరికి 6 ఏళ్లు, మరొకరికి నాలుగేళ్లు. ఈ పిల్లలు ఎప్పుడూ  విద్యుత్ ఎలా ఉంటుందో కూడా చూడలేదు. సాధారణంగా ఉండే మంచాలు కూడా వారు చూడలేదు. పూర్తిగా అడవిలోనే పెరిగారు. 

ఉత్తర కన్నడ జిల్లాలోని కుమతా తాలూకులో రామతీర్థ కొండల్లోని ఒక గుహలో నీనా ,  ఆమె కుమార్తెలను గుర్తించి బయటకు తీసుకు వచ్చారు.  ఈ గుహలో ఆమె రెండు నెలల  ఉన్నప్పటికీ..  ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశంలో అడవులు మరియు గుహల్లో నివసిస్తోందని పోలీసులు  గుర్తించారు.   గుహలో రుద్ర శివుని విగ్రహం, హిందూ దేవతల ఫోటోలు,  రష్యన్ పుస్తకాలు ఉన్నాయి. నీనా ధ్యానం, పూజలు చేస్తూ గడిపేవారు. ఆకలి తీర్చుకోవడానికి  ఇన్‌స్టంట్ నూడుల్స్ వాడేవారు.  విద్యుత్, ఫోన్, లేదా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా, ప్లాస్టిక్ షీట్లపై నిద్రపోయేవారు.  రామతీర్థ కొండలు కొండచరియలు జరిగే ప్రమాదకరమైన ప్రాంతం, విష సర్పాలు, ఇతర వన్యప్రాణులతో నిండి ఉంది ఉంటుంది. కానీ రష్యాన్ మహిళ  నీనా మాత్రం, "పాములు మా స్నేహితులు, మేము వాటిని ఇబ్బంది పెట్టనంత వరకు అవి మాకు హాని చేయవు" అని  పోలీసులతో వాదించింది. 

పోలీసులు నీనా, ఆమె కుమార్తెలను సమీపంలోని శంకర ప్రసాద్ ఫౌండేషన్ ఆశ్రమంలో  ఉంచారు. పిల్లలు మొదటిసారి విద్యుత్ , మంచం, వంటివి చూశారు.   నీనా మొదట తన పాస్‌పోర్ట్ , వీసా అడవిలో పోగొట్టుకున్నాని చెప్పింది.  కానీ పోలీసులు , అటవీ శాఖ అధికారులు గుహ సమీపంలో వాటిని కనుగొన్నారు. ఆమె 2016లో బిజినెస్ వీసాపై భారతదేశంలోకి ప్రవేశించినట్లు, అది 2017లో గడువు ముగిసినట్లు తేలింది. 2018లో ఆమె నేపాల్‌కు వెళ్లి, సెప్టెంబర్ 8, 2018న భారతదేశంలోకి తిరిగి ప్రవేశించినట్లు గుర్తించారు. 

భారతదేశం, అడవులు,   ధ్యానం పట్ల తనకు ఎంతో ఆసక్తి ుందని  పోలీసులు తనను ప్రకృతి నుండి దూరం చేశారని నీనా ఆవేదన వ్యక్తం చేశారు.  "మేము ప్రకృతిలో జీవించడానికి అలవాటు పడ్డాము, మా పిల్లలు సంతోషంగా ఉన్నారు. గుహలో జీవనం సౌకర్యవంతంగా, తాజాగా ఉంది. పాములు ఇంటిలో కూడా వస్తాయి, కాబట్టి గుహలో ఉండటం ప్రమాదకరం కాదు" అని  తన కుటుంబసభ్యులకు సమాచారం పంపినట్లుగా చెబుతున్నారు.  నీనా ఇద్దరు కుమార్తెలు భారతదేశంలో జన్మించినప్పటికీ, వారి తండ్రి గురించి సమాచారం ఇవ్వడానికి నీనా అంగీకరించడం లేదు.  ఈ జననాల సమయంలో ఆమె వైద్య సహాయం పొందిందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఆమెను రష్యా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.