Himachal CM Race:


పక్కన పెట్టేసిన పెద్దలు..


హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. రెండ్రోజులుగా పార్టీలో మేధోమథనం సాగుతోంది. ఈ రేసులో దాదాపు నలుగురు సీనియర్లున్నారు. వారిలో మాజీ సీఎం వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ ఒకరు. ఆమెతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సుఖ్వీందర్ సింగ్, సీఎల్‌పీ నేత ముకేష్ అగ్నిహోత్రి, మరో లీడర్ రాజేంద్ర రాణా పేర్లు జాబితాలో ఉన్నాయి. ప్రతిభా సింగ్‌..తనకే సీఎం పదవిని కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ...అధిష్ఠానం మాత్రం అందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమెకు అండగా ఉన్నారు. ఆమె మద్దతుదారులు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే షిమ్లా హెడ్‌క్వార్టర్స్ ఎదుట వాళ్లంతా నిరసన చేపట్టారు. ప్రతిభా సింగ్‌ను సీఎం చేయాలని నినదించారు. అయితే...అధిష్ఠానం మాత్రం ప్రతిభా సింగ్‌ పేరుని లిస్ట్‌లో నుంచి తీసేసినట్టు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురిలో ఎవరిని సీఎంగా చేయాలనే యోచనలో ఉంది. అయితే...ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నది ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉంది. అధిష్ఠానం నిర్ణయం మాత్రమే తీసుకోగలదు. కానీ...ఎమ్మెల్యేల్లో ఎవరైనా
వేరే అభ్యర్థికి మద్దతు తెలుపుతూ రాజీనామా వరకూ వెళ్తే అది అతి పెద్ద సమస్యగా మారుతుంది. ప్రతిభా సింగ్ విషయంలో కాంగ్రెస్ పెద్దలు వెనకడుగు వేయడానికి ఓ ప్రధాన కారణముంది. మండి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్న ఆమెకు సీఎం పదవి అప్పగిస్తే ఆ సీట్‌ ఖాళీ అవుతుంది. ఇప్పటికిప్పుడు మళ్లీ ఉప ఎన్నికలు పెట్టక తప్పదు. కానీ...ఈ ప్రాంతంలోని 10 సీట్లలో కాంగ్రెస్ 9 స్థానాలు కోల్పోయింది. ఇలాంటి సమయంలో మళ్లీ అక్కడ ఎన్నికలు పెట్టి ఓడిపోవడం ఎందుకు అన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్. అదీ కాకుండా...ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌కు కేబినెట్‌లో ఉన్నత పదవి ఇవ్వాలని భావిస్తోంది. అందుకే...ప్రతిభా సింగ్‌ను పక్కన పెట్టనుంది. 


అధిష్ఠానానిదే నిర్ణయం..


ప్రతిభా సింగ్‌కు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ...వారందరినీ పక్కన పెట్టేసింది అధిష్ఠానం. సుఖ్వీందర్‌ సింగ్‌కు ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువగా ఉందని భావిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కలిసి దీనిపై ఓ నిర్ణయం తీసుకుని హై కమాండ్‌కు తమ అభిప్రాయాలు తెలిపారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్ఠానమే. "సీఎం ఎవరు అన్న విషయంలో స్పష్టత రాలేదు. చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి. 
అన్ని కోణాల్లోనూ ఆలోచించి అభ్యర్థిని ప్రకటిస్తాం. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే సీఎం ఎవరో నిర్ణయిస్తారు. ఓటర్లు తమ నిర్ణయమేంటో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కీలక బాధ్యత తీసుకుని సీఎం ఎవరో తేల్చుకోవాలి" అని వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ వెల్లడించారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి తెలియజేశానని, వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు కట్టుబడి ఉంటామని ఓ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.


Also Read: KCR Risky Politics : తెలంగాణ లేని రాజకీయం వర్కవుట్ అవుతుందా ? కేసీఆర్ ప్రతీ సారి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారా ?