కర్ణాటకలో ఇప్పుడు " హిజాబ్" అంశం చర్చనీయాంశం అవుతోంది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ వేసుకోవడానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ప్రతిగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు వేసుకుని స్కూల్‌కు వస్తున్నారు. ఇది రాజకీయ అంశంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. చివరికి అంశం కర్ణాటక హైకోర్టుకు చేరింది. హైకోర్టులో మంగళవారం ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరగనుంది.
హిజాబ్ వివాదం ఎలా ప్రారంభమైందంటే ?
కర్ణాటక లోని ఉడుపి జిల్లా కుందాపుర పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ముస్లిం విద్యార్థినులు తల, మెడను కప్పి వుంచే స్కార్ఫ్ ధరించి క్లాసులకు హాజరవుతున్నారు. ఆ వస్తధారణను హిజాబ్ అంటారు. అయితే గత వారం హిజాబ్‌తో వచ్చిన విద్యార్థినులను లోనికి అనుమతించలేదు ప్రిన్సిపల్. ప్రభుత్వ నిర్ణయం మేరకు హిజాబ్ ధరించి కళాశాలకు వస్తే అనుమతించే ప్రసక్తే లేదని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు ఈ నిబంధన గురించి చెప్పలేదని వారంటున్నారు. ఈ వివాదం ముదరడంతో మరికొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. దీంతో వివాదం మరింత ముదిరింది.
ఆజ్యం పోసిన మంత్రుల బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు !
మత సంప్రదాయాలు పాటించేందుకు విద్యాసంస్థలు వేదిక కాదని హిజా్ వివాదంపై హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర వ్యాఖ్యానించారు. రాజకీయం ప్రవేశించడంతో ముస్లిం విద్యార్థినులకు బయట నుంచి మద్దతు ప్రకటనలు వచ్చాయి. జమ్ము-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ హిజాబ్ ధరించినందుకు ముస్లిం బాలికలకు కాలేజీల్లో ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని అన్నారు. కర్నాటకలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కూడా ఇది రాజకీయ ప్రేరేపితమైనదిగా ప్రకటించి ముస్లిం విద్యార్థినులకు మద్దతు ప్రకటించారు.
హైకోర్టులో మంగళవారం విచారణ !
హిజాబ్ ధరించడం తన ప్రాథమిక హక్కని, దానిని హరిస్తున్నారని నిరసన తెలుపుతున్న విద్యార్థిని ఒకరు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ జరగుతోంది.హిజాబ్ తో అమ్మాయిలు కాలేజ్ లో అడుగు పెట్టకూడదని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఆదేశాలు జారీ చెయ్యడంతో కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు ఉడిపి ఎమ్మెల్యేకి, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బందిని ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరంతా అఫిడవిట్లు దాఖలు చేసి తమ వాదనలు వినిపించాల్సి ఉంది.
కర్ణాటకలో అంతకంతకూ విస్తరిస్తున్న హిజాబ్ వివాదం !
కర్ణాటక తీర ప్రాంత విద్యాసంస్థల్లో హిజాబ్‌కు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతం లోని కొప్ప, మంగళూరుల్లోని కాలేజీల్లో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. రాజకీయాల కోసం విద్యా సంస్థలను పార్టీలు వాడుకునే ప్రయత్నం చేయడం వివాదాస్పదమవుతోంది. కేవలరం రాజకీయ స్వార్థబుద్దితో విద్యార్థుల మనుసుల్లో విషబీజాలు నాటుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వారు ఏ రంగా దుస్తులు వేసుకుంటే ఎదుటివారికి ఇబ్బందేమిటనే మౌలికమైన ప్రశ్న ఇక్కడ ప్రధానంగా వస్తోంది.