Raj Thackeray controversial slogan Hatao Lungi Bajao Pungi: మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ వాదాన్ని బలంగా వినిపించే రాజ్ ఠాక్రే, తమిళనాడు బీజేపీ నేత కె. అన్నామలై మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ముంబైలోని తమిళులు, ఇతర దక్షిణాది వలసదారులను ఉద్దేశించి రాజ్ ఠాక్రే చేసిన 'హటావో లుంగీ, బజావో పుంగీ' అనే వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువయ్యాయి. అన్నామలై ముంబై మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయడంతోనే ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిస్పందనగా అన్నామలై, రాజ్ ఠాక్రే రాజకీయాలు కాలం చెల్లినవని, ఆయన విద్వేషాన్ని రగిలిస్తున్నారని విమర్శించారు.
'హటావో లుంగీ, బజావో పుంగీ' నినాదం ఏమిటి?
1960వ దశకంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే హటావో లుంగీ, బజావో పుంగీ అనే నినాదం ఇచ్చారు. అంటే లుంగీ ధరించిన వారిని తరిమికొట్టండి అని అర్థం. ఇప్పుడు అదే నినాదాన్ని రాజ్ ఠాక్రే మళ్ళీ ప్రస్తావించడం రాజకీయ సెగను పెంచింది. 1960లలో ముంబైలో ఉన్న దక్షిణాది వారు ముఖ్యంగా తమిళులు, కన్నడిగులు , మలయాళీలు స్థానిక మరాఠీల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ శివసేన ఈ నినాదాన్ని ఇచ్చింది. లుంగీ అనేది దక్షిణాది వారిని సూచించే పదంగా, పుంగీ అనేది వారిని వెళ్లగొట్టడాన్ని సూచించే సంకేతంగా వాడారు. రాజ్ ఠాక్రే ఇప్పుడు మళ్ళీ ఈ పాత నినాదాన్ని గుర్తు చేయడం ద్వారా, తన పార్టీ మరాఠీ మనుస్ అజెండాను మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ఠాక్రే తరహా రాజకీయాలకు కాలం చెల్లిందన్న అన్నామలై
ఈ వివాదంపై అన్నామలై గట్టిగానే స్పందించారు. రాజ్ ఠాక్రే మనుషుల మధ్య విభజన తెస్తున్నారని, భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు పౌరులకు ఉందని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్ర అభివృద్ధిలో దక్షిణాది వారి శ్రమ కూడా ఉందని, కేవలం ప్రాంతీయ వాదంతో రాజకీయ లబ్ధి పొందాలని చూడటం అమానుషమని అన్నామలై పేర్కొన్నారు.
ముంబైలో ఎమ్మెన్నెస్ కార్యకర్తల ఆందోళనలు
దీనికి ప్రతిగా ఎంఎన్ఎస్ కార్యకర్తలు ముంబైలోని పలు చోట్ల అన్నామలై దిష్టిబొమ్మలను దహనం చేయడం, తమిళ వ్యతిరేక నినాదాలు చేయడం వంటి ఘటనలు ఉద్రిక్తతలకు దారితీశాయి.
మరాఠీ సెంటిమెంట్ తో బలపడేందుకు ఠాక్రే సోదరుల ప్రయత్నం
మహారాష్ట్రలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమీకరణాల దృష్ట్యా రాజ్ ఠాక్రే తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ సెంటిమెంట్ ను వాడుకుంటున్నారు. శివసేన రెండుగా చీలిపోయిన తర్వాత సోదరులు ఇప్పుటు ఒక్కటయ్యారు. మరాఠీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఈ దూకుడు ప్రదర్శిన్నారని భావిస్తున్నారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న రాజ్ ఠాక్రే, అదే పార్టీకి చెందిన అన్నామలైతో తలపడటం ఎన్డీయే కూటమిలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది. ఈ వివాదం కేవలం మాటలకే పరిమితమవుతుందా లేక క్షేత్రస్థాయిలో వలసదారులపై దాడులకు దారితీస్తుందా అన్నది వేచి చూడాలి.