Farmer's March in Haryana: మరోసారి రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్‌లు నెరవేర్చాలంటూ ఈ నెల 13వ తేదీన భారీ మార్చ్‌ చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అటు హరియాణాతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ భద్రత పెంచారు. పలు చోట్ల బ్యారికేడ్‌లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. హరియాణా నుంచి ఢిల్లీ వరకూ మార్చ్ నిర్వహించనున్నారు రైతులు. ఇప్పటికే హరియాణా ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరగకుండా చూసుకోవాలని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగానే ఇంటర్నెట్ సేవల్ని ముందుగా నిలిపేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాము పండిస్తున్న పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలన్నది రైతుల ప్రధాన డిమాండ్. దీంతో పాటు పెన్షన్, బీమా పథకాల అమలునీ డిమాండ్ చేస్తున్నారు. ఈ మార్చ్‌లో దాదాపు 200 రైతు సంఘాలు పాల్గొనేందుకు సిద్ధమయ్యాయి. అంబాలా, కురుక్షేత్ర, కైతల్‌ సహా పలు జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించారు. పంజాబ్ హరియాణా సరిహద్దుల్ని పోలీసులు ఇప్పటికే మూసేశారు. రైతులు తమ రాష్ట్రంలోకి రాకుండా పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రయాణాలపై ఆంక్షల విధించింది. ఫలితంగా..ఛండీగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. 






చర్చలకు ఆహ్వానం..


ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఇప్పటికే పోలీసులు ప్రజలకు సూచించారు. అటు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. హరియాణా, ఢిల్లీ సరిహద్దుల్ని బారికేడ్‌లతో మూసేశారు. పార్లమెంటరీ బలగాల్లోని 50 సంస్థలు రంగంలోకి దిగి భద్రత అందిస్తున్నాయి. రైతులు ఎవరైనా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం రైతు నేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీనే భేటీ అయ్యేందుకు కేంద్రం ఆహ్వానం పంపిందని కొందరు రైతు నాయకులు వెల్లడించారు. కేంద్రమంత్రులు పియూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్‌ రైతు సంఘాల నేతలో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురు మంత్రులు ఫిబ్రవరి 8వ తేదీన ఓసారి సమావేశమయ్యారు. రైతుల సమస్యలపై చర్చించారు.