Gutta Amit makes another appeal to Nara Lokesh on Vijaya Ghee issue:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తిగా ఉన్న  విజయ  డెయిరీ బ్రాండ్ వినియోగంపై ఇప్పుడు సరికొత్త వివాదం రేగింది. తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్‌కు  సోషల్ మీడియాలో సుదీర్ఘమైన విజ్ఞప్తిచేశారు.  ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్  అనుసరిస్తున్న విధానాలు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు.

విజయా  బ్రాండ్ పేరుతో  మోసం చేస్తున్నారు!

తెలంగాణలో విజయ తెలంగాణ పేరుతో ప్రభుత్వం స్వయంగా రైతుల నుంచి పాలను సేకరించి, ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అమిత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం APDDCF వద్ద సొంతంగా పాల సేకరణ గానీ, చిల్లింగ్ సెంటర్లు గానీ, ప్రాసెసింగ్ యూనిట్లు గానీ లేవని ఆయన గుర్తు చేశారు. కేవలం  విజయ  అనే బ్రాండ్ పేరును ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ పద్ధతిలో కట్టబెట్టారని, ఆ ప్రైవేట్ ఆపరేటర్లు ఎక్కడో సేకరించిన పాలను విజయ బ్రాండ్ పేరుతో విక్రయిస్తూ వినియోగదారులను నమ్మిస్తున్నారని ఆయన లేఖలో ఆరోపించారు.

 మ్యాక్స్  యూనియన్ల పరిధిపై అభ్యంతరం 

కృష్ణా, కర్నూలు, నెల్లూరు వంటి జిల్లాల్లో మ్యాక్స్ చట్టం కింద నమోదైన జిల్లా యూనియన్లు తమ పరిధిని దాటి 'విజయ' బ్రాండ్‌ను వాడుతున్నాయని అమిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయా జిల్లాల పరిధులు దాటి ఈ బ్రాండ్‌ను మార్కెటింగ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ సంస్థలు విజయ బ్రాండ్ వాడుతూ  ఏపీ డెయిరీ క్వాలిటీ ప్రొడక్ట్ అని ప్రచారం చేసుకోవడం వల్ల సామాన్య ప్రజలు అది ప్రభుత్వ ఉత్పత్తే అని మోసపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

 లోకేష్ చర్యలు తీసుకోవాలన్న గుత్తా అమిత్  

ప్రధాని మోదీ ఆశించిన "ఒకే దేశం - ఒకే మార్కెట్  స్ఫూర్తికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రైవేట్ ఫ్రాంచైజీ ఒప్పందాలు విరుద్ధమని అమిత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వెంటనే ఈ ప్రైవేట్ ఒప్పందాలను రద్దు చేయాలని, అనధికారికంగా విజయ బ్రాండ్‌ను వాడుతున్న జిల్లా యూనియన్లపై చర్యలు తీసుకోవాలని నారా లోకేష్‌ను కోరారు. ఇలాంటి దిద్దుబాటు చర్యల వల్లనే సహకార రంగం బలోపేతం అవుతుందని, కల్తీ పాలను అరికట్టవచ్చని ఆయన సూచించారు. ఈ అంశంపై నేరుగా కలిసి వివరించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.