Stranded in Gulf countries:    పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.  భారత ప్రభుత్వం ఇప్పటికే  రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం, కేవలం గత వారం రోజుల్లోనే మార్చి 1 నుండి 7 వరకు దాదాపు  67,000 మంది భారతీయులను ప్రత్యేక విమానాలు,  వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చారు. ఇందులో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. 

Continues below advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గల్ఫ్ బాధితుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తెలంగాణ నుండి సుమారు  15 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నట్లు అంచనా. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. విదేశీ వ్యవహారాల శాఖతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, గల్ఫ్ దేశాల్లోని వివిధ తెలుగు సంఘాలతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రవాస ఆంధ్రుల భద్రత కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు * ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ రంగంలోకి దిగింది. ఇప్పటికే బహ్రెయిన్ , దుబాయ్‌లో చిక్కుకుపోయిన సుమారు 107 మందిని  ప్రత్యేక చొరవతో స్వరాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 500 మందికి పైగా వ్యక్తులు క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సుమారు 100 మంది గుడ్‌విల్ అంబాసిడర్లు గల్ఫ్ దేశాల్లో తెలుగు వారికి వసతి , రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నారు.

Continues below advertisement

కేంద్ర ప్రభుత్వం కేవలం విమాన ప్రయాణాలే కాకుండా, సముద్ర మార్గంలో చిక్కుకున్న నావికుల భద్రతపై కూడా దృష్టి పెట్టింది. ఢిల్లీలో 24/7 పనిచేసే  స్పెషల్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి, పశ్చిమాసియాలోని భారత రాయబార కార్యాలయాలతో  ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్‌స్పేస్ పాక్షికంగా మూసివేసిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారతీయులను తరలిస్తున్నారు. కువైట్ నుండి రియాద్‌కు రోడ్డు మార్గంలో తరలించి, అక్కడి నుండి విమానాల ద్వారా భారత్‌కు చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది.

ఉపాధి నిమిత్తం వెళ్ళిన వారి కంటే, విజిటింగ్ వీసాపై వెళ్ళిన వారు , విమానాశ్రయాల్లో చిక్కుకున్న వారు స్వదేశానికి తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గల్ఫ్ దేశాల్లోనే ఉండి పనిచేస్తున్న వారు ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నారని, అయితే స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని రాయబార కార్యాలయాలు సూచిస్తున్నాయి. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ భవన్ల ద్వారా  కూడా విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేస్తున్నాయి.

ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, యుద్ధం తీవ్రతరం అయితే భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు  సిద్ధంగా ఉండాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. యుద్ధ క్షేత్రం నుండి తిరిగి వస్తున్న వారిని చూసి గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో కొంత ఉపశమనం కనిపిస్తున్నా, అక్కడ ఉండిపోయిన వారి గురించి ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది.