Will the Gulf countries attack Iran: గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ , ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇప్పుడు నేరుగా సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలకు పాకాయి. బుధవారం నాడు ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు సౌదీ రాజధాని రియాద్ ను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఈ దాడుల కారణంగా సౌదీ అరేబియా తన సహనం నశించిందని, ఇరాన్‌పై సైనిక చర్యకు తాము సిద్ధమని బహిరంగంగానే హెచ్చరించింది. రియాద్‌పై ఇరాన్ ప్రయోగించిన నాలుగు క్షిపణులను సౌదీ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. అయితే, కూలిన క్షిపణి శకలాలు నివాస ప్రాంతాలపై పడటంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గల్ఫ్ దేశాలైన ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ లలోని కీలక ఇంధన కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడింది. ఫిబ్రవరి 28న ఇరాన్ గ్యాస్ నిల్వలపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతికారంగానే తాము ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
ఈ ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ పాత్ర కీలకంగా మారింది. 2025 సెప్టెంబర్‌లో సౌదీ అరేబియాతో పాకిస్థాన్ కుదుర్చుకున్న వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం ప్రకారం.. సౌదీపై ఏదైనా దేశం దాడి చేస్తే, దానిని తమపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని పాక్ పేర్కొంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా మాట్లాడుతూ.. సౌదీ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగితే తాము సైనిక పరంగా జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని ఇరాన్‌ను హెచ్చరించినట్లు సమాచారం. అయితే, సొంత దేశంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పాక్ నేరుగా యుద్ధంలోకి దిగుతుందా లేదా అనేది వేచి చూడాలి.
సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ గురువారం ఇరాన్‌తో మేం నిర్మించుకున్న కొద్దిపాటి నమ్మకం ఇప్పుడు పూర్తిగా ముక్కలైంది అని వ్యాఖ్యానించారు. అరబ్ దేశాల అత్యవసర సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, తమ దేశ రక్షణ కోసం సైనిక చర్యకు (Military తాము వెనకాడబోమని, ఆ హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే కువైట్, బహ్రెయిన్, యూఏఈ వంటి దేశాలు సౌదీకి మద్దతుగా నిలుస్తున్నాయి.
ప్రస్తుతం గల్ఫ్ దేశాలు ఇరాన్‌పై నేరుగా దాడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అమెరికా కూడా తన సైనిక స్థావరాలను అప్రమత్తం చేయడమే కాకుండా, సౌదీకి అవసరమైన రక్షణ సహాయాన్ని అందజేస్తోంది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు పెరగడం, చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లు దాటడంతో.. ఈ ప్రాంతంలో మరో పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
