Christian divorce appeal property rights legal heirs: భర్త మరణించిన అనంతరం కూడా విడాకుల ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ఒక విచిత్రమైన కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసులోని ప్రత్యేకాంశాలను, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం.. కుటుంబ న్యాయస్థానం గతంలో జారీ చేసిన విడాకుల డిక్రీని పూర్తిగా రద్దు చేసింది. దీనితో సదరు మహిళకు చట్టబద్ధంగా మళ్లీ వితంతు హోదాను కల్పించడమే కాకుండా, మరణించిన తన భర్త ఆస్తిపై సర్వహక్కులు పొందే అర్హతను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Continues below advertisement

క్రైస్తవ మతానికి చెందిన ఒక దంపతులకు 1976లో వివాహమై ఆరుగురు పిల్లలు జన్మించారు. అయితే, తన భార్య తన్ను విడిచిపెట్టి వెళ్లిపోయిందనే కారణంతో భర్త 2020లో గుజరాత్‌లోని ఆనంద్ ఫ్యామిలీ కోర్టులో  విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. సదరు మహిళ ఆ విడాకుల దావాను కోర్టులో వ్యతిరేకించకపోవడంతో, విచారణ జరిపిన కుటుంబ న్యాయస్థానం సెప్టెంబర్ 2022లో వివాహ బంధాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా విడాకుల డిక్రీని మంజూరు చేసింది.

ఆ తర్వాత ఫిబ్రవరి 2024లో సదరు భర్త మరణించాడు. అయితే భర్త చనిపోయిన 18 నెలల తర్వాత, అంటే ఆగస్టు 2025లో ఆ మహిళ విడాకుల డిక్రీని సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. మరణించిన తన మాజీ భర్త చట్టబద్ధమైన వారసులుగా తమ ఆరుగురు పిల్లలనే ఈ కేసులో ప్రతివాదులుగా ఆమె చేర్చారు.   చనిపోయిన వ్యక్తికి అనుకూలంగా ఇచ్చే విడాకుల తీర్పును కూడా సవాలు చేయడం చట్టబద్ధంగా సమర్థనీయమేనని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. భర్త విడిచిపెళ్లిన ఆస్తి ప్రస్తుతం పిల్లల చేతుల్లో ఉందని, విడాకుల ఉత్తర్వు ఇలాగే ఉంటే తన వితంతు హోదాతో పాటు ఆస్తి హక్కులు కూడా తీవ్రంగా దెబ్బతింటాయని కోర్టుకు వివరించారు.

Continues below advertisement

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఐ.జె. వోరా, జస్టిస్ ఆర్.టి. వాచ్ఛానీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉభయ పక్షాలు క్రైస్తవులని, ఇక్కడ చట్టబద్ధమైన వారసులు పిటిషనర్   సొంత పిల్లలే అయినందున  దావా వేసే హక్కు సజీవంగానే ఉంటుందని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు రాకముందే భర్త మరణించి ఉంటే ఆ వ్యక్తిగత దావా అక్కడితోనే ముగిసిపోయేదని, కానీ డిక్రీ జారీ అయిన తర్వాత దంపతులు మాజీ భార్యాభర్తలుగా మారడం వల్ల అది ఆస్తి హక్కులపై,  వారి సామాజిక హోదాపై తీవ్ర ప్రభావం చూపుతుందని బెంచ్ విశ్లేషించింది.

 ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో వ్యక్తి మరణంతో కేసు మూతపడదని, బాధిత వ్యక్తి కోర్టు తీర్పును సవాలు చేసే హక్కు కలిగి ఉంటారని  ధర్మాసనం పేర్కొంది. కేసు లోతుల్లోకి వెళ్లి సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం లేకుండానే.. ఫ్యామిలీ కోర్టు పేర్కొన్న భార్య ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టింది  అనే నిర్ధారణను పక్కనబెడుతున్నట్లు తెలిపింది. పిటిషనర్-భార్య   ఆస్తి హక్కులు ,  వితంతు హోదాను పరిగణనలోకి తీసుకుని, ఆనంద్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పు, డిక్రీని పూర్తిగా కొట్టివేస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు తన తుది ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.