Gujarat Elections 2022:


భాజపా భయపడుతోంది: కేజ్రీవాల్ 


ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు భాజపా తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేసిందని చెప్పారు. మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌పై కొనసాగుతున్న విచారణను నిలిపివేస్తామని చెప్పినట్టు వెల్లడించారు. ఓ టీవీ ఛానల్‌లో ఇంటర్వ్యూకి హాజరైన కేజ్రీవాల్...ఈ కామెంట్స్ చేశారు. భాజపా గతంలో మనీశ్ సిసోడియాకు డబ్బుని ఆశ చూపించాయని, ఇప్పుడు తననూ కాంటాక్ట్ అవుతున్నారని ఆరోపించారు. "భాజపా చేసిన ఆఫర్‌ను మనీశ్ సిసోడియా కాదన్నారు. 
ఢిల్లీ సీఎం పదవి ఇస్తానని ఆశపెట్టినా పట్టించుకోలేదు. ఇప్పుడు నన్ను మభ్య పెడుతున్నారు. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయకుంటే ఇద్దరు మంత్రులను విడుదల చేస్తామని చెబుతున్నారు" అని తీవ్ర ఆరోపణలు చేశారు. "మిమ్మల్ని ఎవరు సంప్రదించారు" అన్న ప్రశ్నకు "వాళ్ల పేర్లు ఎలా బయట పెడతాను. వాళ్లు నేరుగా అడగకుండా వాళ్ల మనుషులతో అడిగిస్తారు" అని చెప్పారు కేజ్రీవాల్. ఒకరి నుంచి ఒకరు ఈ మెసేజ్‌ను పాస్ చేస్తారని, చివరకు అది చేరాల్సిన చోటకు చేరుతుందని అన్నారు. ఇదే సమయంలో ఢిల్లీ, గుజరాత్ ఎన్నికల గురించీ ప్రస్తావించారు. "ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై భాజపా భయపడుతోంది. ఢిల్లీ, గుజరాత్‌లో తప్పకుండా  గెలుస్తామన్న ధీమా ఉంది. ఢిల్లీ ఎమ్‌సీడీ ఎన్నికలతో పాటు గుజరాత్‌లోనూ ఓడిపోతామేమో అన్న భయం భాజపాను పట్టుకుంది. అందుకే ఈ రెండు ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించేలా జాగ్రత్తపడ్డారు" అని అన్నారు. ఢిల్లీ MCD,గుజరాత్ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తుండటం వల్ల రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 


సుకేశ్ చుట్టూ రాజకీయాలు..


సుకేశ్ చంద్రశేఖర్ కేజ్రీవాల్‌పై చేసిన వ్యాఖ్యలూ హాట్‌టాపిక్‌గా మారాయి. రాజ్యసభ సీటు కోసం అరవింద్ కేజ్రీవాల్ తనను రూ.50 కోట్లు అడిగారని లెటర్ రాశారు సుకేశ్. అంతే కాదు. పార్టీలో ఓ బడా బిజినెస్‌మెన్‌ను చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. దీనిపై భాజపా స్పందించింది. "ఆప్‌ అవినీతిమయమైన పార్టీ అని నిరూపించటడానికి ఇంత కన్నా సాక్ష్యం ఇంకేముంటుంది" అని చెబుతోంది. కొందరు బడబడా డాన్‌లతో, బిజినెస్‌మేన్‌లతో ఆప్‌నకు సన్నిహిత సంబంధాలున్నాయని విమర్శించింది. భాజపా విమర్శలకు అటు ఆప్ కూడా కౌంటర్ ఇచ్చింది. సుకేష్ చంద్రశేఖర్ అండతోనే భాజపా ఎన్నికల బరిలోకి దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుకేశ్‌ను బ్రాండింగ్ చేస్తోందని విమర్శించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేరు చెప్పుకుని సుకేష్  రూ.215 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని చెబుతోంది. అంత డబ్బు అతనికి ఎక్కడి నుంచి వచ్చిందో భాజపా చెప్పాలని డిమాండ్ చేసింది.