Gujarat Election 2022:


ఎన్నో రోజుల సస్పెన్స్ తరవాత..


ఎన్నో రోజుల సస్పెన్స్‌కు తెర దించుతూ...గుజరాత్ ఎన్నికల తేదీలు ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీలు ప్రకటించినప్పుడే..గుజరాత్ ఎలక్షన్ డేట్స్ వెల్లడిస్తారని భావించినా..అలా జరగలేదు. రకరకాల కారణాలు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చారు. దీనిపై ప్రతిపక్షాలు కాస్త తీవ్రంగానే స్పందించాయి. ఎన్నికల ముందు భాజపా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకే
ఈసీ అలా వ్యవహరించిందని మండి పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే..ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్య కాలంలోనే గుజరాత్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు. ఈ కారణంగా...ఆ ఆరోపణలు, విమర్శలు ఇంకాస్త పెరిగాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలు ప్రకటిస్తున్న సందర్భంలో..మీడియా నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పలు ప్రశ్నలు ఎదుర్కొన్నారు. వాటిలో "గుజరాత్ ఎన్నికల తేదీలు ఎందుకు ఆలస్యంగా ప్రకటించారు" అనే ప్రశ్నే ప్రధానంగా వినిపించింది. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ ఆలస్యానికి ఎన్నోకారణాలున్నాయని వివరించిన రాజీవ్ కుమార్..మోర్బి ఘటన అందులో ఒకటి అని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం కారణంగా...ఎన్నికల తేదీలు ఆలస్యంగా ప్రకటించాల్సి వచ్చిందని వెల్లడించారు. అంతే కాదు. నవంబర్ 2న రాష్ట్ర సంతాప దినం నిర్వహించారని, ఇది కూడా ఓ కారణమని తెలిపారు. ఎంత వివరణ ఇచ్చినప్పటికీ..కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాలు ఆగ్రహంగానే ఉన్నాయి. కేవలం భాజపాకు లబ్ధి చేకూర్చేందుకే తేదీలను వాయిదా వేశారనీ విమర్శిస్తున్నాయి. 


ఇదీ ఓ కారణమా..? 


హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో న‌వంబ‌ర్ 12న ఒకే విడ‌త‌లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈసీ తెలిపింది. డిసెంబ‌ర్ 8న ఓట్లు లెక్కించి ఫ‌లితాలు వెల్ల‌డించ‌నుంది. అంటే పోలింగ్‌కు ఫ‌లితాల విడుద‌ల‌కు మ‌ధ్య 26 రోజుల స‌మ‌యం ఉంది. గుజ‌రాత్‌లో విడ‌త‌ల వారీగా పోలింగ్ నిర్వ‌హించ‌డానికి అనువుగా ఈసీ హిమాచ‌ల్ కౌంటింగ్ తేదీని డిసెంబ‌ర్ 8గా నిర్ణ‌యించిన‌ట్లు సమాచారం. గుజరాత్‌ శాసనసభ గడువు 2023 ఫిబ్రవరి 18తో ముగియనుంది. గుజరాత్‌లో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది. 


ఏబీపీ సీ ఓటర్ సర్వే..


ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న గుజరాత్‌ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనే అంశంపై ABP News,C Voter Opinion Poll నిర్వహించింది. ఈ పోల్‌లో గుజరాత్‌లో మరోసారి భాజపా విజయం సాధిస్తుందని అంచనా వేసింది. 1995 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉంది భాజపా. ఇప్పుడు ఏడోసారి కూడా గెలుస్తుందని ఈ పోల్‌లో తేలింది. మొత్తం 182 స్థానాల్లో భాజపా 135-143 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఆప్‌ రేసులోకి రావడం వల్ల భాజపా, కాంగ్రెస్ ఓటు శాతం తగ్గిపోతుందని తెలిపింది. భాజపాకు 46.8%, కాంగ్రెస్‌కు 32.3%, ఆప్‌నకు 17.4% ఓట్లు దక్కుతాయని అంచనా వేసింది ABP News,C Voter Opinion Poll 2022. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు 36-44 సీట్లు వస్తాయని, ఆప్‌ సున్నా లేదంటే 2 సీట్లు మాత్రమే సాధించే అవకాశముందని వెల్లడించింది. 


Also Read: Gujarat Election 2022: దూకుడు పెంచిన గుజరాత్ కాంగ్రెస్, తీర్మానాల జాబితా విడుదల చేసిన ఖర్గే