Chinese robot debacle India AI Expo: న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన రోబో తీవ్ర దుమారం రేపింది. యూనివర్సిటీ తన సొంత ఆవిష్కరణగా పేర్కొన్న ఓరియన్ అనే రోబోటిక్ డాగ్, అసలు చైనాకు చెందిన యూనిట్రీ గో2 అని తేలడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ వివాదం దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉండటంతో, ఎక్స్‌పో నుంచి వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం గల్గోటియాస్ యూనివర్సిటీని ఆదేశించింది.
ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోతో మొదలైంది. గల్గోటియాస్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నేహా సింగ్ తమ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ రోబోను అభివృద్ధి చేసిందని, ఇందుకోసం సుమారు రూ. 350 కోట్లు వెచ్చించామని గొప్పగా మీడియా ఇంటర్యూల్లో చెప్పారు. అయితే, నెటిజన్లు ఆ రోబోపై ఉన్న బ్రాండింగ్‌ను గమనించి, అది ఆన్‌లైన్‌లో కేవలం రూ. 2-3 లక్షలకు లభించే చైనా కంపెనీ ఉత్పత్తి అని ఆధారాలతో సహా బయటపెట్టారు.
దీనిపై ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా స్పందించాయి. భారతీయ ప్రతిభను చాటాల్సిన వేదికపై చైనా ఉత్పత్తులను సొంత ఆవిష్కరణలుగా ఎలా ప్రదర్శిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇది భారత్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. చైనా మీడియా కూడా ఈ ఘటనను ఉటంకిస్తూ భారత్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో కేంద్ర ఐటీ శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది.
వివాదం ముదరడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ వివరణ ఇస్తూ.. తాము ఆ రోబోను తయారు చేశామని ఎప్పుడూ చెప్పలేదని, విద్యార్థుల పరిశోధనల కోసం దానిని కొనుగోలు చేశామని పేర్కొంది. ప్రొఫెసర్ మాటల్లో స్పష్టత లేకపోవడం వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయితే, ఎక్స్ లో వీరి వివరణకు కమ్యూనిటీ నోట్ తోడైంది, యూనివర్సిటీ గతంలో చేసిన క్లెయిమ్స్ అబద్ధమని అది స్పష్టం చేసింది.
చివరికి, ప్రభుత్వం ఆదేశాలతో గల్గోటియాస్ స్టాల్ వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేసి, వారిని ఎక్స్‌పో ప్రాంగణం నుండి పంపివేసినట్లు సమాచారం. దేశీ ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన ఇలాంటి వేదికలపై విదేశీ పరికరాలను రీ-బ్రాండింగ్ చేసి ప్రదర్శించడంపై శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఐటీ వర్గాలు భావిస్తున్నాయి.
