Governor invites Vijay to form government:    ఐదు రోజులుగా తమిళనాడును ఉత్కంఠకు గురిచేసిన రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది.  తమిళగ వెట్రి కళగం  (TVK) అధినేత విజయ్, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్  కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన జాబితాను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు సమర్పించారు. దీంతో విజయ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ అధికారికంగా ఆహ్వానించారు.  ఆదివారం మధ్యాహ్నం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

శనివారం ఉదయం నుంచే చెన్నైలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. మెజారిటీ మార్కు  118  కోసం ఎదురుచూస్తున్న విజయ్‌కు, వీసీకే  అనూహ్య మద్దతు ప్రకటించడంతో లైన్ క్లియర్ అయింది. టీవీకే వ్యూహకర్త ఆదవ్ అర్జున సమక్షంలో వీసీకే అధినేత తిరుమావళవన్ మద్దతు లేఖను అందజేయడంతో విజయ్ బలం 119కి చేరుకుంది. ఈ పరిణామంతో విజయ్ అభిమానులు, పార్టీ శ్రేణులు రాజ్‌భవన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. 

సాయంత్రం 5 గంటల సమయంలో తన మిత్రపక్షాలైన కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే నేతలతో కలిసి విజయ్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ కు కేరళ వెళ్లే పని ఉండటంతో విజయ్‌కు అపాయింట్ మెంట్ లభిస్తుందా లేదా అన్నదానికి సందిగ్ధత ఏర్పడింది. ఓ దశలో విజయ్.. లోక్ భవన్ కు బయలుదేరి మధ్యలో యూటర్న్ తీసుకున్నారు. కానీ గవర్నర్ తన కేరళ పర్యటన వాయిదా వేసుకుని విజయ్‌కు అపాయింట్మెంట్ ఖరారు చేశారు. ఆరున్నరకు లోక్ భవన్‌కు వెళ్లి 119 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన అధికారిక మద్దతు లేఖలను గవర్నర్‌కు అందజేశారు. ఈ జాబితాను నిశితంగా పరిశీలించిన గవర్నర్, విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతినిస్తూ లేఖను అందజేశారు. ఈ క్రమంలోనే రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన తేదీ, సమయంపై గవర్నర్‌తో విజయ్ చర్చించి ముహూర్తం ఖరారు చేసుకున్నారు.

విజయ్ ప్రమాణ స్వీకారానికి చెన్నై నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ఆదివారం జరగబోయే ఈ చారిత్రాత్మక ఘట్టానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాహుల్ గాంధీ, ఖర్గే హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.  . ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత రావడంతో టీవీకే శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుతూ పండగ చేసుకుంటున్నారు.

కొత్త కేబినెట్ కూర్పుపై కూడా కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. మద్దతు ఇచ్చిన మిత్రపక్షాలకు కేబినెట్‌లో ప్రాధాన్యత ఇస్తూనే, సామాజిక సమీకరణాలను విజయ్ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. సుదీర్ఘకాలం పాటు వెండితెరను ఏలిన  దళపతి  విజయ్, ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తుండటంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలుకాబోతోంది.  ఆదివారం జరగబోయే ఈ  పట్టాభిషేకం  కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.