Ghulam Nabi Azad: 


ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు..


సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామని కొందరు ఉగ్రవాదులు బెదిరించినట్టు కొన్ని రిపోర్ట్‌లు వెల్లడించాయి. దీనిపై ఆజాద్ స్పందించారు. "లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నట్టు రిపోర్ట్‌లు వస్తున్నాయి. వాటిని నేనూ పరిశీలించాను. కానీ నేను దేనికీ భయపడను. నేను కశ్మీర్‌కు వచ్చే ముందు భారత్ భద్రతా సలహాదారు అజిత్ దోబల్‌ను కలిశానని ఉగ్రవాదులు చెబుతున్నారు. నా జీవితంలో ఆయనను నేను ఎప్పుడూ కలవలేదు. దేవుడిపైన ఒట్టేసి చెబుతున్నాను. హోం మంత్రి కనుక అమిత్‌షాను కలిశాను. నేనో పార్లమెంట్‌ సభ్యుడిని. రకరకాల కారణాలతో కొందరిని కలవాల్సి వస్తుంది" అని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా తనపై గతంలో దాడులు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. పంజాబ్, జమ్ముకశ్మీర్‌లో పర్యటించిన సమయంలో దాదాపు 50 సార్లు తనపై హత్యాయత్నం జరిగినట్టు చెప్పారు. "ఒకవేళ నన్ను తీసుకెళ్లిపోవాలని దేవుడు అనుకుంటే నేనే సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉన్నానో వాటినీ నాతో పాటే తీసుకెళ్లిపోతాడు" అని ఎమోషనల్‌గా చెప్పారు ఆజాద్. ఓ ర్యాలీలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. యువత హింసామార్గాన్ని వీడాలని పిలుపునిచ్చారు. ఇక్కడి దుస్థితికి పాకిస్థానే కారణమని విమర్శించారు. "గన్స్ పట్టుకోవటం మాత్రమే పరిష్కారం కాదు. అది మీ జీవితాలనే నాశనం చేస్తుంది. దేశానికి కూడా అది మంచిది కాదు. బ్రిటీష్ వాళ్లను ఓడించేందుకు మహాత్మా గాంధీ తుపాకులనో, కత్తులనో పట్టుకోలేదు. ఎలాంటి దాడి చేయలేదు. అప్ఘనిస్థాన్ నుంచి ఇరాక్, పాలస్తీనా వరకూ హింసామార్గం ఎంచుకున్న ఏ ముస్లిం దేశమైనా పూర్తిగా నాశనమైంది" అని అభిప్రాయపడ్డారు గులాం నబీ ఆజాద్. 
 
త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన..


కాంగ్రెస్ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. తన కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 10 రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని సస్పెన్స్‌కు తెరదించారు. ఇటీవల బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో ఈ విషయం స్పష్టం చేశారు. 73 ఏళ్ల ఆజాద్ గత నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన సూచనలు, సలహాలను ఏళ్ల తరబడి ఏఐసీసీ మూలనపెట్టేసిందని సోనియా గాంధీకి రాసిన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై కూడా విమర్శలు చేశారు. ఆజాద్‌ రాజీనామా చేసిన తర్వాత కశ్మీర్‌లో దాదాపు 1500 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. కశ్మీర్‌ ప్రజల కోసం తన పోరాటం కొనసాగిస్తానని ఆజాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత సొంత బలాన్ని నిరూపించుకునేందుకు తన కంచుకోట లాంటి బారాముల్లాను ఆజాద్ ఎన్నుకున్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, స్థానికులకు భూమి హక్కు, ఉపాధి హక్కు కోసం తాను కృషి చేస్తానని ఆజాద్ అన్నారు. బారాముల్లాలో ర్యాలీ తర్వాత కుప్వారా, సౌత్ కశ్మీర్‌లో ఆజాద్ వరుసగా ర్యాలీలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీపై ఆజాద్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


Also Read: PM Modi Birthday Special: BJP బంపర్ ఆఫర్- మోదీ బర్త్‌డేకు బంగారు ఉంగరాలు, చేపలు పంపిణీ!