Shepherd boy rises to rank 551: ఇటీవలే విడుదల అయిన సివిల్స్ పరీక్షా ఫలితాల్లో  బిర్దేవ్ సిద్ధప్ప ధోనే  అనే యువకుడు ఒ  సివిల్ సర్వీసెస్ పరీక్షలో 551వ ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) సాధించాడు. మిగతా  550 మందితో పోలిస్తే ఇతను ప్రత్యేకమైన వ్యక్తి.  మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా, కాగల్ తాలూకాలోని యమగే గ్రామానికి చెందిన ఈ యువకుడు, ఆర్థిక ఇబ్బందులు, పరిమిత వనరుల మధ్య కఠిన పరిస్థితులను అధిగమించి తన మూడవ ప్రయత్నంలో ఈ అద్భుత విజయాన్ని సాధించాడు.  

బిర్దేవ్ సిద్ధప్ప ధోనే  సాంప్రదాయ గొర్రెల కాపరి కుటుంబం. తండ్రి సిద్ధప్ప ధోనే, తల్లి, ఒక అన్న, ఒక సోదరి కుటుంబం.  గొర్రెలు , మేకల పెంపకం ద్వారా జీవనం సాగిస్తుంది. ఇంట్లో సరైన సౌకర్యాలు ఉండవు. సిద్ధప్ప యమగేలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. 10వ తరగతిలో ముర్గుడ్ సెంటర్‌లో 96 శాతం మార్కులతో ప్రథమ స్థానం సాధించాడు.  జై మహారాష్ట్ర హైస్కూల్‌లో 11,  12వ తరగతులు  89 శాతం మార్కులతో మొదటి స్థానం సాధించాడు.  2020లో పూణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్  నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు.

సివిల్ సర్వీసెస్‌లో చేరాలనే కల బిర్దేవ్‌కు చిన్నప్పటి నుండి ఉండేది. 2020-21లో  బిర్దేవ్ ఇండియా పోస్ట్‌లో పోస్ట్‌మన్‌గా పనిచేశాడు. అయితే, సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఒక సన్నిహిత స్నేహితుడి ఆర్థిక సహాయంతో ఝిల్లీకి వెళ్లి UPSC పరీక్షకు సిద్ధమయ్యాడు. మొదటి రెండు ప్రయత్నాలలో విఫలమైనప్పటికీ నిరాశ చెందలేదు. మూడవ ప్రయత్నంలో  2024లో  అతను 551వ ర్యాంక్ సాధించాడు. బిర్దేవ్ ఖరీదైన కోచింగ్ సెంటర్లలో చేరలేదు. సొంతంగానే ప్రిపేర్ అయ్యేవాడు.  

UPSC ఫలితాలు ప్రకటించినప్పుడు బిర్దేవ్ కర్ణాటకలోని బెల్గామ్ సమీపంలో తన మామకు చెందిన గొర్రెలను కాస్తున్నాడు. ఒక స్నేహితుడు ఫోన్ చేసి అతను 551వ ర్యాంక్ సాధించినట్లు తెలియజేశాడు. విజయ వార్త తెలిసిన వెంటనే, అతని మామ అతని తలపై పసుపు రంగు పాగా   కట్టి, పవిత్ర బండారా ని నుదుటన రాశాడు.  ఇది వైరల్ గా మారింది.   551వ ర్యాంక్‌తో, బిర్దేవ్ భారత పోలీస్ సర్వీస్ (IPS)లో చేరే అవకాశం ఉంది. బిర్దేవ్ కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉంది. అతని తండ్రి రెండు నెలల క్రితం కిడ్నీ స్టోన్ శస్త్రచికిత్స చేయించుకున్నారు, దీని కారణంగా బిర్దేవ్ ఇంటి బాధ్యతలను కూడా చూసుకోవలసి వచ్చింది.                 

బిర్దేవ్ విజయంలో అతని స్నేహితులు ప్రముఖ పాత్ర పోషించారు. అతని COEP సహవిద్యార్థి, ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా ఉన్న  ప్రంజల్ చోప్డే ,  అక్షయ్ సోలంకర్ అతనికి నిరంతర మద్దతు అందించారు.  బిర్దేవ్ కథ ధన్గర్  సామాజికవర్గంతో పాటు  ఇతర వెనుకబడిన  వర్గల యువతకు ప్రేరణగా నిలుస్తుంది