Foxconn Apologises: 


అలా చేయకుండా ఉండాల్సింది: ఫాక్స్‌కాన్


చైనాలో మళ్లీ కొవిడ్‌ వణికిస్తోంది. లాక్‌డౌన్‌లు, ఆంక్షలు మొదలయ్యాయి. ఫ్యాక్టరీలు, కంపెనీల్లోనూ మునుపటిలాగే కొవిడ్ రూల్స్ పాటించాల్సి వస్తోంది. అయితే...ఈ రూల్స్ మరీ కఠినంగా ఉండటం వల్ల కొందరు ఇబ్బందులు పడుతున్నారు. జేంగ్‌జోవూలోని ఫాక్స్‌కాన్ ఐఫోన్ ప్లాంట్‌ ఉద్యోగులు దీనిపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. దాదాపు రెండు మూడు రోజులుగా అక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ సిబ్బందితో, ఫాక్స్‌కాన్ యాజమాన్యంతో గొడవకు దిగారు ఉద్యోగులు. ఇది కాస్త హింసాత్మకంగా మారింది. ఫ్యాక్టరీలోని కెమెరాను ధ్వంసం చేశారు నిరసనకారులు. ఇంత జరిగాక కానీ...ఫాక్స్‌కాన్ మేలుకోలేదు. ఇదే తరహాలో ఘర్షణలు కొనసాగితే నష్టం తప్పదని క్షమాపణ చెప్పేందుకు ముందుకొచ్చింది. "కరోనాతో సతమతం అవుతున్న సమయంలో కొత్త వారికి ఉద్యోగాలు ఇవ్వడం సరైన నిర్ణయం కాదు. ఇది తప్పే" అని స్పష్టం చేసింది. అంతే కాదు. ఉద్యోగుల డిమాండ్‌లు ఏంటో తెలుసుకుని వాటిని తీర్చేందుకు తప్పకుండా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చింది. ఇటీవలే 20 వేల మందిని నియమించుకున్నప్పటికీ...వాళ్లెవరూ విధుల్లోకి రావడం లేదు.  


జీతాల్లేవని అసహనం..


చైనాలోని iPhone మేకింగ్ ప్లాంట్‌లో ఒక్కసారిగా నిరసనలు తీవ్రమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ ఆందోళనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. Bloomberg రిపోర్ట్ ప్రకారం...సెంట్రల్ చైనాలోని జేంగ్‌జోవూలో Foxconn ప్లాంట్‌లో వందలాది మంది ఉద్యోగులు సెక్యూరిటీ గార్డ్స్‌తో గొడవకు దిగారు. ఇది కాస్తా చినికిచినికి గాలివానగా మారిపోయింది. చాలా నెలలుగా ఇక్కడి ఉద్యోగులపై ఆంక్షల్ని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన గొడవకు కారణమిదే. వందలాది మంది సిబ్బంది రోడ్‌పైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పీపీఈ సూట్‌లు ధరించిన సెక్యూరిటీ గార్డ్‌లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా...ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. జీతాలు సరిగా ఇవ్వడం లేదన్న అసహనంతో పాటు ఇన్‌ఫెక్షన్ సోకుతుందన్న భయంతో వాళ్లు ఆందోళనకు దిగారు. "ఇక్కడికి రావాలంటే భయమేస్తోంది. మా అందరికీ కొవిడ్ సోకిందేమో అని అనుమానంగా ఉంది" అని ఓ ఉద్యోగి అన్నాడు. మరికొందరు యాజమాన్యం తీరుపై విమర్శలు చేస్తున్నారు. "కాంట్రాక్ట్‌ విషయంలో కుదుర్చుకున్నఒప్పందాన్ని ఉన్నట్టుండి మార్చేశారు" అని మండి పడ్డారు. ఫాక్స్‌కాన్‌లో 2 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ ప్లాంట్ ఉన్న ఏరియాను "iPhone City"గా పిలుస్తారు. దాదాపు అక్టోబర్ నుంచి ఈ ప్రాంతంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. చాలా మంది ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్లిపోయారు. ఫాక్స్‌కాన్ యాజమాన్యం..కొత్త ఉద్యోగులను నియమించుకుంది. జీతాలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పటికీ అది నెరవేరకపోవటం వల్ల ఉద్యోగులంతా ఇలా నిరసన బాట పట్టారు.