Delhi fuel ban: ఢిల్లీలో 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాలకు ఇంధన నిషేధం విధించారు. కాలుష్యం పెరిగిపోతోందని అవి రోడ్డు మీదకు వచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఈ విధానం, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఆదేశాల ప్రకారం జులై 1, 2025 నుండి అమలులోకి వచ్చింది, దీని లక్ష్యం ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం. అయితే, ఈ విధానం సామాజిక మీడియాలో విస్తృతంగాచర్చకు కారణం అవుతోంది. 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకు పైబడిన పెట్రోల్ వాహనాలు "ఎండ్-ఆఫ్-లైఫ్ వెహికల్స్" గా ప్రకటించారు. ఢిల్లీలో రిజిస్టర్ అయిన వాహనాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలకు కూడా ఫ్యూయల్ బ్యాన్ వర్తిస్తుంది. ఈ నిషేధం అమలు కోసం సుమారు 350 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఏర్పాటు చేశారు, ఇవి VAHAN డేటాబేస్‌తో అనుసంధానించి ఉంటాయి. వాహనాల నమోదు వివరాలను రియల్-టైమ్‌లో తనిఖీ చేస్తాయి.
నిషేధాన్ని ఉల్లంఘించిన వాహనాలను స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, వాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. ీ విధానంపై మాజీ IAF అధికారి సంజీవ్ కపూర్, X ప్లాట్‌ఫామ్‌లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విధానం వ్యక్తిగత వాహనాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. “ 40 ఏళ్లకు పైబడిన విమానాలను ఎగురవేస్తున్నాము, రైళ్లు, బస్సులు, ఫెర్రీలు, వాణిజ్య విమానాలు కూడా మూడు దశాబ్దాలకు పైగా పాతవి ఉన్నాయి. ఈ నిషేధం కేవలం వ్యక్తిగత వాహనాలపై మాత్రమే ఎందుకు విధించారు?” అని ఆయన ప్రశ్నించారు.
ఈ నిషేధం వల్ల వాహనదారులు పెట్రోల్, డీజిల్ ను బ్లాక్ మార్కెట్ లో కొంటారని.. బ్లాక్ మార్కెట్ పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నిర్ణయంపై ఢిల్లీ వాసులు, నెటిజన్లు తీవ్ర విమర్శలుచేస్తున్నారు. చాలా మంది మంచి నిర్వహణ ఉన్న తమ కార్లను “వింటేజ్ స్క్రాప్”గా లేబుల్ చేశారని ఆగ్రహిస్తున్నారు. 62 లక్షల కారు యజమానులు తమ జీవితాంతం ఆదా చేసిన డబ్బుతో కార్లు కొన్నారు, EMIలు చెల్లించారు, ఇప్పుడు వాటిని నిషేధించారు. వాటికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఢిల్లీ పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ (DPDA) ఈ విధానాన్ని విమర్శించింది, పెట్రోల్ పంప్ సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులుగా మార్చడం వల్ల వారిపై అదనపు ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది. ఈ విధానాన్ని మార్చాలని ఢిల్లీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.