Bengal Assembly Elections Fish campaign : పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం ప్రస్తుతం విభిన్న మలుపులు తిరుగుతోంది. అభివృద్ధి, అవినీతి వంటి అంశాల కంటే ఇప్పుడు అక్కడ చేపల కూర చుట్టూ రాజకీయం తిరగడం ఆసక్తికరంగా మారింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విసిరిన  చేపలు తినే సవాల్  ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.  

చేపల కూర చుట్టూ మొదలైన రాజకీయం 

బెంగాల్ సంస్కృతిలో చేపలు ఒక విడదీయలేని భాగం. బెంగాలీలు కుల,మతాలకు అతీతంగా చేపలను తింటారు. అది వారికి వెజ్ లెక్క అనుకోవచ్చు.అయితే బీజేపీ అధికారంలోకి వస్తే ఆహారపు అలవాట్లపై దాడి చేస్తుందని చేపల్ని తిననీయరని ఇతర పార్టీలు ముఖ్యంగా టీఎంసీ ప్రచారం చేస్తోంది. దీంతో బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం చేస్తున్న  అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ  మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన ఒక అడుగు ముందుకు వేసి, చేపల కూర తినడంలో మమతా దీదీకి, నాకు మధ్య పోటీ పెడితే.. నేనే గెలుస్తాను  అంటూ సవాల్ విసిరారు.   అస్సాం ప్రజలు కూడా బెంగాలీల కంటే ఎక్కువగా చేపలను ఇష్టపడతారు. నాకు వండటం, వడ్డించడం,  తినడం మూడూ తెలుసు.. కానీ దీదీకి తెలియదని బిశ్వశర్మ విమర్శించారు.  

 ఎన్నికల అస్త్రంగా ఆహారం

 వెజిటేరియన్ వర్సెస్ నాన్-వెజిటేరియన్ అనే చర్చ బెంగాల్‌ను కుదిపేస్తోంది. బీజేపీని ఉత్తరాది పార్టీగా, శాఖాహార భావజాలాన్ని రుద్దే పార్టీగా టీఎంసీ చిత్రించే ప్రయత్నం చేయగా.. దానికి చెక్ పెట్టేందుకే హిమంత బిస్వా శర్మ ఈ  చేపల సవాల్‌ ను తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది. తాము కూడా చేపలనుని ఇష్టపడతామని, బెంగాల్ ప్రజల అలవాట్లకు తాము దూరం కాదని చెప్పడం ద్వారా స్థానిక ఓటర్లను ఆకట్టుకోవాలన్నది బీజేపీ ప్లాన్. ఇప్పటికే స్థానిక బీజేపీ నేతలు ఇదే విషయాన్ని చెబుతూ..తమతో పాటు చేపల్ని కూడా తీసుకెళ్తున్నారు. 

ఢిల్లీ నుంచి బెంగాల్ దాకా చర్చ 

 సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా చేపల యుద్ధం పేరుతో మీమ్స్ షేర్ చేస్తున్నారు. సీరియస్ రాజకీయ అంశాల కంటే ఇలాంటి వినోదభరితమైన , సెంటిమెంట్ పరమైన అంశాలే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని కొందరు అంచనా వేస్తున్నారు. మొత్తానికి బెంగాల్ ఎన్నికల బరిలో  చేపల కూర  ఒక శక్తివంతమైన రాజకీయ ఆయుధంగా మారింది. బెంగాలీలు ఈ వివాదాన్ని ఏ కోణంలో చూసి ఓట్లు వేస్తారో చూడాల్సి ఉంది.