Fire Accident in Apartment: యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. గౌర్ సిటీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులో మంటలు చెలరేగినట్టు స్థానికులు వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన అపార్ట్‌మెంట్ వాసులు బయటకు వచ్చేశారు. ఈ సమాచారం అందుకున్న కాసేపటికే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి తరలివచ్చింది. ఉదయం 9.40 నిముషాలకు అగ్ని ప్రమాదం జరగ్గా మంటలు అదుపులోకి తీసుకురావడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. 11 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే...ఈ మంటల్లో కొందరు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు.
"అపార్ట్‌మెంట్ వాసులు మాకు అగ్ని ప్రమాదం సంభవించిందని సమాచారం అందించారు. వెంటనే మూడు అగ్నిమాపక సిబ్బంది బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. 11 గంటల సమయానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయి"
- అధికారులు
తాళం వేసి ఉన్న ఫ్లాట్‌లో నుంచి మంటలు చెలరేగాయి. ఫ్లాట్ ఓనర్ ఊరికి వెళ్లిపోయాడని ప్రాథమిక విచారణలో తేలింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే...కచ్చితంగా కారణమేంటనేది విచారణ తరవాతే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.