FIA Guinness World Record: న్యూజెర్సీలోని పార్సిప్పానీ నగరంలో ప్రసిద్ధ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్‌ అసోసియేషన్స్‌ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌ జనరల్‌, ప్రముఖ అంతర్జాతీయ సాంకేతిక సంస్థ జోహో కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఆగస్టు 15 సాయంత్రం జరిగిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో అతి పెద్ద ఫ్లాగ్‌పోల్ నంబర్‌ విభాగంలో సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికారికంగా నమోదు చేసింది. పార్సిప్పానీలోని వెటరన్స్‌ మెమోరియల్ పార్క్‌ వేదికగా జరిగిన ఈ అద్భుత ప్రదర్శనలో మొత్తం 1,383 అమెరికా జెండాలను ప్రత్యేక ఫ్లాగ్‌పోల్‌పై అమర్చి, ఒక భారీ 250 సంఖ్య రూపంలో రూపొందించారు. ఈ అమెరికా జెండాల ప్రదర్శన చుట్టూ భారత జాతీయ త్రివర్ణ పతాకాలను వలయాకారంలో అమర్చారు. 

Continues below advertisement

ఈ అపూర్వ ప్రదర్శన భారత్‌ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని యునైటెడ్‌్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాబోయే ద్విశతాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఒక అరుదైన మైలురాయి. వేదికపై గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి క్షుణ్ణంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన అనంతరం, అధికారిక రికార్డు ధృవీకరణ పత్రాన్ని నిర్వాహక ప్రతినిధులకు, ప్రముఖులకు అందజేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టం రెండు దేశాల మధ్య ఉన్న సజీవ స్నేహ సంబంధాలకు అలాగే ఇరు దేశాల సార్వభౌమత్వ విలువలకు అద్దం పట్టింది. 

ఈ గిన్నిస్ వరల్డ్‌ రికార్డు కేవలం ఒక సంఖ్యకు పరిమితం కాలేదు. ఇది భారత్, అమెరికా దేశాల మధ్య చిరకాలంగా కొనసాగుతున్న బంధాన్ని ప్రతిబింబించేలా అత్యంత ప్రణాళికబద్ధంగా రూపొందించారు. 1383 అమెరికా జెండాలను క్రమపద్ధతిలో అమర్చి, అమెరికా రాబోయే 250 వార్షికోత్సవానికి సూచికగా 250 ఆకృతిని డిజైన్ చేశారు. దీని చుట్టూ భారత జాతీయ పతాకాలు ప్రదర్శించడం ద్వారా ఇరు దేశాల ప్రజల పరస్పర గౌరవం, స్నేహపూర్వక వాతావరణం కనిపించాయి. వాలంటీర్ల అద్భుతమైన కృషి, నిర్వాహకుల దీర్ఘకాలిక ప్రణాళికతో వెటరన్స్‌ మెమోరియల్ పార్క్ ఒక దేశభక్తి తరంగంగా మారిపోయింది. 

Continues below advertisement

అరుదైన రికార్డుపై నాయకుల హర్షం 

ఈ అద్భుత ఘట్టంపై ఎఫ్‌ఐఏ ఛైర్మన్‌ అంకుర‌ వైద్య మాట్లాడుతూ... ఈ రికార్డు తమ కమ్యూనిటీ సాధించిన ఘన విజయమని కొనియాడారు. "ఈ గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం అనేది మా కమ్యూనిటీ అంకితభావానికి, సాంస్కృతి వారసత్వంపై ఉన్న గౌరవానికి ఇదో ఉదాహరణ. ఈ చారిత్రాత్మక మైలురాయి మన మూలాలను గౌరవించడమే కాకుండా, మనందరం ఒకే ఆలోచనతో, కలిసి ముందుకు సాగినప్పుడే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తుంది" అని అభిప్రాయపడ్డారు. గతంలో కూడా ఎఫ్‌ఐఏ అనేక గిన్నిస్ రికార్డ్ ప్రయత్నాలను చేపట్టిందని, ప్రతి సవాలును అధిగమించి కమ్యూనిటీని ఈ విధంగా ఒకటిగా చేర్చడం చూసినప్పుడు పడిన కష్టమంతా మర్చిపోతామని గుర్తుచేశారు. 

ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ...." ఈ రికార్డు తెరవెనుక శ్రమించిన, చరిత్ర సృష్టించడానికి కారణమైన ప్రతి ఒక్క వాలంటీర్‌కి, భాగస్వామికి, మద్ధతుదారునికి దక్కుతుంది. ఈ ఫ్లాగ్‌పోల్‌లో ప్రదర్శన మన ఐక్యతకు, దేశభక్తికి, ప్రపంచ ఐక్యతకు ప్రతిరూపంగా నిలుస్తుంది" అని కామెంట్ చేశారు. ఈ కార్యక్రమంలో దౌత్యరంగ ప్రతినిధులు కూడా పాల్గొని ఇరు దేశాల సంబంధాల బలోపేత అవసరాన్ని గుర్తు చేశారు.