Farmers Protest: రైతుల ఆందోళనలు రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతుల్ని దేశ రాజధాని వరకూ రానివ్వకుండా ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకుంటున్నారు. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోనే వాళ్లను ఆపేస్తున్నారు. భారీ బారికేడ్‌లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. వాటినీ లెక్క చేయకుండా రైతులు దూసుకొస్తున్నారు. ఆ సమయంలోనే వాళ్లపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది రైతులు గాయపడినట్టు తెలుస్తోంది. కనీసం 100 మంది రైతులు పోలీసులతో జరిగిన ఘర్షణలో గాయపడ్డారని సమాచారం. వీరిలో ముగ్గురు బాధితులు కంటిచూపు కోల్పోయారని వైద్యులు చెబుతున్నారు. పంజాబ్ హరియాణా సరిహద్దు ప్రాంతంలో హరియాణా పోలీసులు రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన సమయంలోనే రైతులు కంటి చూపు కోల్పోయారు. చాలా మంది రైతులకు ఎముకలు విరిగిపోయాయని, తలగాయాలతో ఆసుపత్రుల్లో చేరారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. శంభు, ఖనౌరి సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఘర్షణలు జరుగుతున్నాయి. పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ బల్బీర్ సింగ్ ప్రస్తుత ఉద్రిక్తతలపై స్పందించారు. 


"పోలీసులతో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు రైతులు కంటి చూపు కోల్పోయారు. వాళ్లను ప్రస్తుతం హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నాం. అన్ని పరీక్షలు చేయించాం. కంటి చూపు మళ్లీ వచ్చే అవకాశం లేదని వైద్యులు వెల్లడించారు. కేవలం టియర్ గ్యాస్ మాత్రమే. పోలీసులు బులెట్స్ కూడా వినియోగించారు. రైతుల్ని అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు. అందుకే ఇలా జరిగింది"


- బల్బీర్ సింగ్, పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి


బులెట్‌లు కళ్లలోకి దూసుకుపోయాయని, వాటి వల్ల కంటి చూపు రైతులు కంటి చూపు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. పంజాబ్-హరియాణా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో దాదాపు 250 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లలో ఎక్కువగా పంజాబ్‌కి చెందిన రైతులే ఉన్నారు. బారికేడ్‌లను తొలగించి ఢిల్లీ వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు టియర్‌ గ్యాస్‌తో పాటు water cannonsని ప్రయోగించారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. పింఛన్‌ ఇవ్వడంతో పాటు తమపై ఇప్పటి వరకూ పెట్టిన పోలీస్ కేసులను రద్దు చేయాలన్న డిమాండ్‌లతో ఆందోళనలు నిర్వహిస్తున్నారు.