Praja Bhavan Rash Driving Case: పంజాగుట్ట సమీపంలోని ప్రజా భవన్ ఎదుట జరిగిన రాష్ డ్రైవింగ్ ఘటన కేసులో (Rash Driving Case) కీలక మలుపు చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే (Bodhan Ex MLA Son) కుమారుడు సోహెల్ అలియాస్ రహేల్ ను పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. లొంగిపోయిన నిందితుడు అబ్దుల్ ఆసిఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పోలీసులు ప్రస్తావించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి బారీకేడ్లను ఢీ కొట్టింది ఎమ్మెల్యే కుమారుడు సోహెల్ అని పోలీసులు తేల్చారు. కేసు నుంచి తప్పించుకునేందుకే వారి ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తున్న అబ్దుల్ ఆసిఫ్ ను లొంగిపోవాలని సోహెల్ ఆదేశించాడు.


దీంతో తన యజమాని సోహెల్ ఆదేశానుసారం పోలీస్ స్టేషన్ లో అబ్దుల్ ఆసిఫ్ లొంగిపోయారు. దీంతో అబ్దుల్ ఆసిఫ్ ని అరెస్టు చేసి పంజాగుట్ట పోలీసులు (Praja Bhavan Rash Driving Case) రిమాండ్ పంపారు. అర్ధరాత్రి సమయంలో అత్యంత వేగంగా వచ్చి ట్రాఫిక్ బారీకేడ్స్ ని సోహెల్ ఢీకొన్నారు. సోహెల్ తో పాటు కారులో నలుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి అర్ధరాత్రి సమయంలో లాంగ్ డ్రైవ్ కి సోహెల్ బయలుదేరాడని పోలీసులు తెలిపారు. అలా పంజాగుట్ట వద్దకు రాగానే ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు నుంచి దిగేసి సోహెల్ తప్పించుకొని పారిపోయాడని చెప్పారు. పారిపోయిన సోహెల్ కోసం పంజాగుట్ట పోలీసులు గాలిస్తున్నారు.


ఓ పోలీసు ఇన్స్‌పెక్టర్ పైనా వేటు


ఈ కేసులో అసలు నిందితుడు సోహెల్ కాకుండా మరో వ్యక్తి అబ్దుల్ ఆసిఫ్ పై కేసు నమోదు చేయడంపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కుమారుడ్ని కాపాడేందుకు పోలీసులు కూడా సహకరించారనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ వ్యవహారం పోలీసుల మెడకు కూడా చుట్టుకుంది. విచారణ జరిపిన ఉన్నతాధికారులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ గా ఉన్న దుర్గారావును సస్పెండ్ చేశారు. ఘటన డిసెంబరు 23వ తేదీ అర్ధరాత్రి జరిగితే రెండు రోజుల పాటు విషయం బయటికి రాకుండా పోలీసులు దాచిపెట్టారని కూడా విమర్శలు వస్తున్నాయి.


గతేడాది కూడా రోడ్డు ప్రమాద కేసులో చిక్కుకున్న సోహెల్


మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతేడాది మార్చిలో జరిగిన జూబ్లీహిల్స్‌‌ యాక్సిడెంట్‌‌ కేసులోనూ (Jubilee Hills Accident Case) షకీల్ కుమారుడు సోహెల్ చిక్కుకున్నారు. రాత్రివేళ జూబ్లీహిల్స్ రోడ్‌‌ నంబర్‌‌‌‌ 45లో జరిగిన ప్రమాదంలో ఓ బాలుడు చనిపోయాడు. అప్పట్లో సోహెల్ కారు నడిపినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ మరో వ్యక్తి వచ్చి తానే కారు నడిపానని లొంగిపోయాడు. దీంతో అప్పుడు ఎమ్మెల్యే కొడుక్కి క్లీన్ చిట్ ఇచ్చారు పోలీసులు. తాజాగా మరో ర్యాష్ డ్రైవింగ్ ఘటనలో అదే ఎమ్మెల్యే కొడుకు సోహెల్ ప్రధాన నిందితుడు అయ్యాడు.